బోనాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గురువారం నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏమాత్రం ఏమరుపాటుకు తావియ్యకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశించారు. ఆయన మంగళవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోనాలు వచ్చే నెల 13 వరకు కొనసాగుతాయని, వీటిని భక్తులు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ తదితర ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాల బందోబస్తుపై అధికారులు, సిబ్బందికి సీపీ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ‘గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో 15 రోజులూ అత్యంత కీలకం. ఆయా ఆలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ జారీ చేసిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఏర్పాటు చేసుకుని భక్తులందరూ అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలి. టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్‌డ్మ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌తో పాటు స్థానిక పోలీసులను అవసరమైన స్థాయిలో మోహరించాలి. ఆలయాల వద్దకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకతాయిలకు చెక్ చెప్పడానికి షీ–టీమ్స్‌ను మోహరించాలి. దేవాలయాల పరిసరాల్లో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలి. బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు వంటి క్రతువులు శాంతియుతంగా సాగేలా తగినంత మంది సిబ్బందిని రంగంలోకి దింపాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ తఫ్షీర్ ఇక్బాల్, డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ నర్సింహారావు నేరుగా.. అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌లతో పాటు ఇతర డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయద్దు
కొత్వాల్ వీసీ సజ్జనర్ ఆదేశాలు


