మరింత అభివృద్ధి
హ్యామ్ విధానంలో రూ.338 కోట్లతో నాలుగు లైన్‌లుగా విస్తరణ
తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న రోడ్లతో రూపురేఖలు మారనున్నాయి. నూతనంగా వెలుస్తున్న కాలనీలు, శివార్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించనున్న రోడ్లతో ఆయా నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మేలు చేకూరనుంది. ప్రస్తుతం రెండు లైన్‌లుగా ఉన్న ఈ రోడ్లను నాలుగు లైన్‌లుగా విస్తరించనున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్‌తో ఏర్పాటు చేయనున్న రోడ్లతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. దూర భారంతో పాటు, ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి లభించనుంది.
రూ. 338 కోట్లతో పనులు..
ప్రభుత్వం రాష్ట్రంలో హ్యామ్ అనే పబ్లిక్ –ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని అమలు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్న ఈ విధానంలో రూ.13వేల కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చే పట్టింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 40 శాతం, ప్రైవేటు సంస్థలు 60 శాతం వెచ్చించనున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత 5 నుంచి 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థదే. ఇందులో భాగంగా రూ. 338 కోట్లతో చేపట్టే పనులకు సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి చేతుల మీదుగా ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
విస్తరించనున్న కొహెడ రోడ్డు
రోడ్లకు మహర్దశ
మారనున్న రూపురేఖలు
ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల ప్రజలకు పెరగనున్న కనెక్టివిటీ
నేడు మంత్రులు కోమటిరెడ్డివెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన
శంకుస్థాపన చేయనున్న రోడ్లు
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్ సాగర్ రహదారి నుంచి, హయత్ నగర్‌లోని సాయిబాబా గుడి నుంచి తొర్రూర్, కొహెడ మీదుగా అనాజ్‌పూర్ వరకు.
తొర్రూర్ నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా రాగన్నగూడలోని సాగర్ రహదారి వరకు.
సాగర్ రహదారి ఇంజాపూర్ నుంచి విజయవాడ జాతీయ రహదారి హయత్‌నగర్ వరకు.
అనాజ్‌పూర్, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బండ రావిరాల వరకు విస్తరించనున్నారు.
హయత్‌నగర్ నుంచి కుంట్లూరు, పసుమాముల నుంచి తారామతి పేట వరకు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు రోడ్ల విస్తరణ చేపడుతోంది. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. హ్యామ్ నిధులే కాకుండా, హెచ్‌ఎండీఏ నిధులతో ఇప్పటికే అనేక రోడ్లు పూర్తి చేశాం.
– మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే


