డీసీపీ శిరీష
కొత్తూరు: అవేక్ష స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని షాద్‌నగర్ జోన్ డీసీపీ శిరీష అన్నారు. బుధవారం ఆమె పెంజర్ల అంగన్‌వాడీ కేంద్రం అభివృద్ధికి ముందుకు వచ్చిన అవేక్ష సంస్థ ప్రతినిధి రేవతిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను బోధించడం వల్ల బంగారు భవిష్యత్ నిర్మాణానికి బాటలు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సీఐ నాగార్జునరెడ్డి, సర్పంచ్ జగన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిహార్ యువతి హత్య కేసులో తల్లీకొడుకు అరెస్ట్
పహాడీషరీఫ్: బిహార్ యువతి హత్య కేసు ఘటనలో తల్లీకొడుకును బాలాపూర్ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. బిహార్‌కు చెందిన మహ్మద్ ఇషాక్ కుమార్తె రెహానా కాతూన్(23) షాహిన్‌నగర్‌లోని ప్యారడైజ్ ఫంక్షన్‌హాల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న క్రమంలో బిస్మిల్లా కాలనీకి చెందిన సాలం సయీద్ కుమారుడు అహ్మద్ సాలం(21)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. మైలార్‌దేవ్‌పల్లి ఒరంగడ్డలో నివాసం ఉండే బాలిక తల్లిదండ్రులు వద్దని వారించినా రెండున్నర నెలలుగా అహ్మద్ సాలంతో కలిసి బిస్మిల్లా కాలనీలోనే సహజీవనం చేస్తోంది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున మరోసారి గొడవ పడడంతో, పథకంలో భాగంగా సాలం కత్తితో కాతూన్ వీపు భాగంలో విచక్షణరహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం తన తల్లితో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి చెరువులో పడేసేందుకు విఫలయత్నం చేశాడు. ఇద్దరితో కాకపోవడంతో తెలిసిన వారి సాయం కోరే క్రమంలో పోలీసులకు సమాచారం అంది హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అభినవ్
షాద్‌నగర్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అభినవ్ డిమాండ్ చేశారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలో పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌తో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభినవ్, పార్టీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికి నుంచి విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా విద్యార్థుల బతుకులు మారడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని.. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీకృష్ణ, లక్ష్మీకాంత్‌రెడ్డి, చెట్ల వెంకటేశ్, శ్రీనివాస్‌చారి, ఉదయ్‌గౌడ్, అల్లం అనిల్, ప్రశాంత్‌గౌడ్, సూర్యగౌడ్, సుధాకర్, శివాజీ, వివేక్, శివ, శ్రీశైలం, యాదయ్య, అభిలాశ్, శ్రీధర్, విజయ్, రామకృష్ణ, రాకేశ్, చందు తదితరులు పాల్గొన్నారు.


