ఆమనగల్లు: భూగర్భ జలాల పెంపుకోసం, వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించేందుకు జలసిరి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా ప్రత్యేకాధికారి నీరజ అన్నారు. బుధవారం ఆమె మండల పరిధిలోని సీతారాంనగర్‌తండా, శెట్టిపల్లి గ్రామాల్లో జలసిరి కార్యక్రమంలో భాగంగా వీబీజీ రామ్‌జీ పథకం కింద నిర్మిస్తున్న ఫాంపాండ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. శెట్టిపల్లిలో ఫాంపాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణకు ఫాంపాండ్‌లు ఎంతో ఉపయోగకరమని, వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని నిల్వచేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ రైతు వీటిని నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ సుభాషిణి, ఇబ్రహీంపట్నం ఏపీడీ శేషుకుమార్, ఎంపీడీఓ జయరాం విజయ్, సర్పంచ్‌లు సరిత, జంగమ్మ, ఏపీఓ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారి నీరజ


