షాద్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు సీపీఐ ఆధ్వర్యంలో ‘మార్పు కావాలి.. మార్పు కోసం పోరాడాలి’అనే నినాదంతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జంగయ్య మాట్లాడుతూ.. బీడు భూములకు నీళ్లు అందించేందుకు, తాగునీటి సమస్యను తీర్చేందుకు చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రూపాయి విలువ గణనీయంగా పడిపోయిందని.. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ హయాంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని విమర్శించారు. సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 21 అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ యాత్ర రాత్రికి కొత్తూరు చేరుకుని అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, బుద్దుల జంగయ్య, నాయకులు ప్రభులింగం, శ్రీను, శివకుమార్, దత్తు నాయక్, వంశీచంద్రారెడ్డి, పవన్, చంద్రబాబు, ఆకాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య


