ప్రగతి రథ చక్రం నష్టాల బాటలో.. | - | Sakshi
Sakshi News home page

ప్రగతి రథ చక్రం నష్టాల బాటలో..

Aug 20 2026 7:26 AM | Updated on Aug 20 2026 7:26 AM

రంగారెడ్డిలో ఆర్టీసీ ప్రయాణం ఇలా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలోనే అత్యధిక నష్టాల్లో ఉన్న జిల్లాల జాబితాలో ఉమ్మడి జిల్లాల్లోని షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్‌ డిపోలు ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పర్యవేక్షణ లోపానికి తోడు వచ్చే ఆదాయం కంటే నిర్వహణ వ్యయం రెట్టింపవడం, సాంకేతిక నష్టాలు, రద్దీ వేళల్లో రోడ్లపై సర్వీసులను నడుపకపోవడం, బస్సుల్లో పారిశుద్ధ్య లోపం, తుప్పుపట్టిన పాత బస్సులనే ఇప్పటికీ నడుపుతుండటం, సాంకేతిక లోపాలతో తరచూ రోడ్లపై మొరాయిస్తుండటం, వెరసి ఆ సంస్థను రూ.వంద కోట్లకుపైగా నష్టాల్లోకి నెట్టేశాయి. ఒకప్పుడు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిన సర్వీసులు.. ప్రస్తుతం సీట్ల నిష్పత్తి మేరకు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా రూ.కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు అందజేసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పించింది. జీరో బిల్లులు జారీ చేసి, వారి ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వమే స్వయంగా చెల్లిస్తోంది. అయినా లాభాల బాటపట్టకపోగా.. వరుస నష్టాలను మూటగట్టుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్‌ డిపోలతో పాటు శంషాబాద్‌, ఆమనగల్లు, చేవెళ్ల, శంకర్‌పల్లి, మన్నెగూడ, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి సహా 19 బస్టాండ్లు ఉన్నాయి. వీటికి విలువైన భూములు, షాపులు ఉన్నప్పటికీ అద్దెకు ఇచ్చి, సకాలంలో వసూలు చేయకపోవడం కూడా పరోక్షంగా సంస్థ నష్టాలకు కారణమవుతోంది.

సంస్థ నష్టాలకు మచ్చుకు

మరికొన్ని కారణాలు

● బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరిగితే ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ డీజిల్‌, స్పేర్‌పార్ట్స్‌, మరమ్మతులు, టైర్లు, సిబ్బంది వ్యయం కూడా పెరుగుతోంది. కిలో మీటరుకు అవుతున్న వ్యయం ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది.

● హైదరాబాద్‌కు ఆనుకుని వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువైతే ఒక బస్సు రోజులో చేయగల ట్రిప్పుల సంఖ్య తగ్గుతుంది. దీంతో కిలోమీటర్‌కు వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది.

● పాత డీజిల్‌ బస్సులకు మరమ్మతులు, స్పేర్‌పార్ట్స్‌, బ్రేక్‌డౌన్‌లు పెరిగితే ఒక కిలోమీటర్‌కు వ్యయం పెరుగుతుంది.

● 2026లో ఐ–టిమ్‌ యంత్రాల అమలులో నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా కొన్ని గ్రామీణ, సెమీ అర్బన్‌ మార్గాల్లో టికెట్‌ జారీకి ఎక్కువ సమయం పడుతోంది. ఇది ట్రిప్‌ సమయం, ప్రయాణికుల ఎక్కడం/దిగడం వేగంపై ప్రభావం చూపుతుంది.

ఆర్టీసీ డిపోలు 5

ఆర్టీసీ బస్టాండ్లు 19

మొత్తం ఆర్టీసీ బస్సు సర్వీసులు 868

అంతర్‌ జిల్లా రూట్‌ కనెక్టవిటీ 35

మొత్తం రూట్లు 297

డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది 4,447

రోజు సగటు ప్రయాణికులు 2.36 లక్షలు

రోజు సగటు ఆదాయం రూ.53.96 లక్షలు

పార్సిల్‌, కార్గో సర్వీసు కేంద్రాలు 13

ఏటా వచ్చే ఆదాయం రూ.7 కోట్లపైనే

మహాలక్ష్మి పథకంలో

మహిళలకు జారీ చేసిన జీరో టికెట్లు 215 కోట్లు

ఛార్జీల రూపంలో సమకూరిన ఆదాయం రూ.1,569 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement