అభ్యంతరాల వెల్లువ
ఆమనగల్లు మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 21 అభ్యంతరాలు అందాయి. తమ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉంచాలనే విజ్ఞప్తులే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వార్డుల్లో 1,500 ఓట్లు ఉండగా, మరికొన్ని వార్డుల్లో 800 ఓట్లనే కొనసాగించడంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో వార్డుల విభజన పూర్తి అసంబద్ధంగా ఉన్నట్లు తేలింది. భౌగోళిక ప్రదేశానికి భిన్నంగా వార్డుల విభజన సహా ఓటర్ల కూర్పు ఉన్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు.
చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డులు.. 36 పోలింగ్ స్టేషన్లు.. 25,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 26 అభ్యంతరాలు అందగా, వీటిలో ఐదింటిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మిగిలిన వాటిని ఆమోదించి లోపాలను సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు.. 25,995 మంది ఓటర్లు ఉన్నారు. పదోవార్డులోని 233 మంది ఓటర్లను 11 వార్డులోకి మార్చారు. 12వ వార్డులోని 198 మంది ఓటర్లను 10వ వార్డులోకి మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 23వ వార్డులోని 360 ఓట్లను మూడో వార్డులోకి.. మూడో వార్డులోని 40 ఓట్లను రెండో వార్డులోకి మార్చడంపై ఫిర్యాదులు అందాయి.
షాద్‌నగర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా ప్రదర్శించిన ముసాయిదా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఒకే వీధిలోని ఓటర్లు.. విభిన్న వార్డుల్లో కన్పించడం, కొంత మంది ఓట్లు గల్లంతైనట్లు తేలింది. కాలనీ వారీగా కాకుండా ఇంటి నంబర్ల వారీగా జాబితాను రూపొందించడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తప్పుల తడకగా ముసాయిదా ఉందని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సరి చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
శంకర్‌పల్లిలో మున్సిపాలిటీలో తొమ్మిది అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వీటిలో రెండు ఓట్ల తొలగింపునకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవాటిలో ఒక వార్డుకు బదులు మరో వార్డులో నమోదైన ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నాయి.
తప్పుల తడక.. అసంబద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వార్డుల కూర్పు.. ఓటర్ల జాబితా తయారీ పూర్తి అసంబద్ధంగా ఉన్నట్లు రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పక్కపక్క ఇళ్లలో ఉన్న ఓటర్లను వేర్వేరు వార్డుల్లో నమోదు చేయడం, చనిపోయిన వారి పేర్లు జాబితాలో దర్శనమివ్వడం, ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉన్నట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి పేరుతో మరొకరి ఫొటోలు ప్రచురితం కావడం వంటివి చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఓటర్ల ముసాయిదాను ఆయా మున్సిపాలిటీల్లో ప్రకటించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని ఆయా రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. లోపాలను సరిదిద్ది ఈ నెల 10న తుదిజాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్రాఫ్ట్‌లపై ఆరోపణలు
జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు ఉండగా, ప్రభుత్వం ఇటీవల మాడు కార్పొరేషన్లు సహా ఎనిమిది మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. ప్రస్తుతం మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్లు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు మిగిలాయి. జనవరి 1న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ పూర్తి అసంబద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, 236 పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. 87,197 మంది పురుషులు, 88,113 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కాలనీల వారీగా కాకుండా ఇంటి నంబర్ల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతో చనిపోయిన ఓటర్ల పేర్లు దర్శనమిచ్చాయి. ఒక వార్డులో పక్కపక్కనే ఉన్న రెండు కుటుంబాల ఓట్లు వేర్వేరు వార్డుల్లో కన్పించడం చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, పేర్లలోనూ అనేక తప్పులు దొర్లాయి.
మచ్చుకు కొన్ని..


