మట్టి పిసికిన చేతులతో మైనింగ్‌లో డాక్టరేట్
కొందుర్గు: మట్టి పిసికిన గిరిజన యువకుడు మైనింగ్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం మల్కాపహాడ్ పంచాయతీ అనుంబంధ గ్రామం వాచ్యాతండాకు చెందిన వాలీబాయ్, శంకర్‌నాయక్ దంపతులకు అనూష, కవితతో పాటు వెంకటేష్, సురేశ్ సంతానం. వీరు కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ల వివాహం చేశారు. కుమారులు తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ కూలి పనులు చేస్తూనే చదువుకున్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ పెద్దషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు సురేశ్ సర్కారు పాఠశాలలోనే చదివి ప్రస్తుతం పీహెచ్‌డీ అందుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన ఇంటర్మీడియెట్ ఓ కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చదివాడు. కొత్తగూడ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో బీటెక్, ఐఐటీ దన్‌బాద్ జార్ఖండ్‌లో ఎంటెక్ చేశాడు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ కంపనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించిన సురేశ్ ‘తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్‌లను ఉపయోగించి ఉపరితల బొగ్గు గనుల్లో వాయు కాలుష్య పర్యవేక్షణ, సైబర్ భౌతిక వ్యవస్థలో స్థిరమైన అభివృద్ధి విధానం’అనే అంశంలో పీహెచ్‌డీ పట్టా పొందాడు.
మట్టి పిసికిన చేతులతో మైనింగ్‌లో డాక్టరేట్


