కూరగాయల హబ్‌గా జిల్లా
యాచారం: రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్‌గా మార్చేందుకు రైతు కమిషన్ కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సర్కార్ కావాల్సిన నిధులు మంజూరు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లిలో కూరగాయల సాగు చేపట్టిన రైతులతో బుధవారం యాచారం రైతువేదికలో సమావేశం ఏర్పాటు చేశారు. మూడు గ్రామాలకు చెందిన 169 మంది రైతులకు, మంచాల మండలానికి చెందిన వంద మంది రైతులకు ప్లాస్టిక్ క్రేట్స్, వర్మీ కంపోస్టు యూనిట్లు, తేనెటీగల బాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతుల ఆర్థిక ప్రగతికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యాన, వ్యవసాయాధికారులు రైతులకు అండగా ఉండి ప్రోత్సహించాలని సూచించారు. నూతన సర్పంచ్‌లు రైతుల ఆర్థిక ప్రగతి కోసం కృషి చేయాలని కోరారు. త్వరలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు.
వ్యవసాయ పరికరాల స్టాల్స్ పరిశీలన
రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు తాము తయారు చేసే వ్యవసాయ సామగ్రి, పరికరాలను యాచారం రైతు వేదిక వద్ద ప్రదర్శనకు పెట్టారు. వీటిని పరిశీలించిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులకు ఎలా ఉపయోగపడుతాయి, రాయితీ ఎంత ఇస్తారని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాములు నాయక్, కమిషన్ అధికారులు హరి వెంకటప్రసాద్, స్రవంతి, శ్రావణి, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ జేడీఏ సునీత, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి సురేశ్, వివిధ శాఖల అధికారులు శైలజ, అరుణ, సుజాత, రవినాథ్, నవీన, శ్వేత, రాజశేఖర్ పాల్గొన్నారు.
సాగు పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహం
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి


