గ్రేటర్‌లో విలీనం సరికాదు
● ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి
● మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హయత్‌నగర్: గ్రామాల అడ్డగోలు విలీనంపై ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని రైతు సమస్యలపై అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ జేఏసీ నాయకుడు కొత్త రాంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా, గ్రామాలను నగరంలో విలీనం చేయడం సరికాదన్నారు. అడ్డగోలు విలీనం కారణంగా కొహెడ వంటి పెద్ద పంచాయతీలు ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. కొహెడ గ్రామాన్ని తొర్రూర్ డివిజన్ పరిధిలోకి చేర్చి దూరంగా ఉన్న శంషాబాద్ జోన్‌లో కలపడం సరికాదని.. కొహెడ పేరిట డివిజన్ ఏర్పాటు చేసి ఎల్‌బీనగర్ జోన్‌లో కలపాలనే గ్రామస్తుల డిమాండ్ సమంజసమైందేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరాకు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, కొహెడ భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న విలీన ప్రక్రియతో జిల్లా ఉనికిని కోల్పోయే దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వందల ఎకరాల్లో ఉన్న కొహెడలోని ప్రభుత్వ భూములను సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఇవ్వకుండా పండ్లు, చేపల మార్కెట్లకు ఇవ్వడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, ప్రతాప్, బల్‌దేవ్‌రెడ్డి, రంగారెడ్డి, నర్సిరెడ్డి, కార్తీక్‌గౌడ్, శ్రీలత అనిల్, బాల్‌రెడ్డి, అర్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


