పల్లె ప్రగతి పనులు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులు బాగున్నాయని మధ్యప్రదేశ్ అధికారులు బృందం కితాబు ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి అధికారులు బృందం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో పర్యటించింది. జిల్లా ఏపీడీ చరణ్‌గౌతమ్, యాంకర్ పర్సన్ వీసీ శ్వేత ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించింది. ముందుగా ఎల్మినేడులో ఉపాధి హామీ నిధులతో చేసిన కమ్యూనిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ పెంపకం, పంచాయతీ భవన నిర్మాణం, నాటుకోళ్ల పెంపకానికి సంబంధించిన పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల పనుల గురించి, అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక అధికారులు వివరించారు. అనంతరం తులేకలాన్‌లో ఉపాధి హామీ నిధుతో పండ్ల తోటల పెంపకం, పల్లె ప్రకృతం వనం నిర్వహణ, నర్సరీ, కంపోస్టు యార్డు, వైకుంఠధామం, జేబీ వెంచర్‌లో చెరువుల తవ్వకాలు పరిశీలించారు. ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనులు బాగున్నాయని కొనియాడారు. ఇక్కడ చేపట్టిన పనులను తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తులేకలాన్ సర్పంచ్ సామ అశ్విని రవీందర్, ఎల్మినేడు సర్పంచ్ యాదమ్మ, తులేకలాన్ ఉప సర్పంచ్ డి.జగదీష్, మాజీ సర్పంచ్ యాదగిరి, ఎంపీఓ ఉష, ఏపీఓ తిరపతాచారి, టీఏ రవి తదితరులు పాల్గొన్నారు.
కితాబిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల బృందం


