రండి.. చేరండి
ముందస్తు అడ్మిషన్ల అంశాన్ని విద్యార్థి సంఘాలతో పాటు పలువురు తల్లిదండ్రులు బోర్డు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చే ఆఫర్లకు కక్కుర్తి పడి అటువైపు కనీసం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు లేకపోలేదు. చదువు, ర్యాంకుల పేరుతో ఇప్పటికే విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పరోక్షంగా వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కాలేజీ యాజమాన్యాలపై కనీస చర్యలు తీసుకోలేదు. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే సదరు కాలేజీ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి, అనుమతులు రద్దు చేయాల్సిన పోలీసులు, బోర్డు అధికారులు కలిసి ఉల్టా బాధిత కుటుంబ సభ్యులపైనే కేసులు పురమాయిస్తున్నారు. చివరికి వారితో రాజీ కుదుర్చి.. యాజమాన్యాలతో వారు లబ్ధిపొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెరిట్ టెస్టుల పేరుతో కాలేజీలకు పెద్ద ఎత్తున విద్యార్థులను రప్పించి స్థానికంగా ట్రాఫిక్‌కు కారణమవుతున్నారు. పిల్లలను వెంట తీసుకొచ్చిన తల్లిదండ్రులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెరిట్ టెస్టుల సమాచారాన్ని కనీసం స్థానిక ట్రాఫిక్ పోలీసులకు కూడా అందించడం లేదు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. పరీక్షల నిర్వహణ ప్రారంభమే కాలేదు.. ఫలితాలే రాలేదు.. కానీ అప్పుడే పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు పోటీపడి అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. పిల్లలు చదువుతున్న పాఠశాలల నుంచి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి మెరిట్ స్కాలర్‌షిప్ టెస్టుల పేరుతో విద్యార్థులను వీకెండ్‌లో కాలేజీ క్యాంపస్‌లకు రప్పిస్తున్నాయి. మాయమాటలతో తల్లిండ్రులను మభ్యపెడుతున్నాయి. కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని, ముందస్తు బుకింగ్‌తో ఫీజులో రాయితీ ఉంటుందని, అదే ఏప్రిల్ తర్వాత కాలేజీ ట్యూషన్ ఫీజు డబుల్ అవుతుందని చెప్పి అడ్మిషన్ల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నాయి. తల్లిదండ్రులు వారి మాటలకు నమ్మి, తమ పిల్లల భవిష్యత్ బాగుండాలన్న తపనతో ఏమీ ఆలోచించకుండా వారు అడిగినంత చెల్లించి సీటును ముందే బుక్ చేసుకుంటుండటం విశేషం.
బోర్డు నిబంధనలు బేఖాతార్
జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెండు ఎయిడెడ్, మరో 221 ప్రైవేటు, రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. మెజార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు తట్టిఅన్నారం, కొత్తపేట్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, కోహెడ, ఆదిబట్ల, కొంగరకుర్దు, రావిర్యాల, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే ఉన్నాయి. ఆయా కాలేజీలన్నీ ఇరుకై న అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ విభాగాల వారీగా విభజించి ఎంచుకున్న కోర్సు, క్యాంపస్‌ను బట్టి ఫీజులు నిర్ణయించాయి. రెసిడెన్షియల్‌కు రూ.3 లక్షలుగా నిర్ణయించగా, సెమీ రెసిడెన్షియల్‌కు రూ.1.50 లక్షలు, డేస్కాలర్‌కు రూ.90 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా బుక్ మెటీరియల్, డ్రెస్సులకు అదనంగా మరో రూ.30 వేలు చార్జి చేస్తున్నాయి. బోర్డు నిబంధనకు విరుద్ధంగా మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో గత విద్యార్థులు సాధించిన ర్యాంకులను సాకుగాా చూపించి ముందస్తు అడ్మిషన్లకు తెరతీశాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థిపై సదరు ఏజెంట్‌కు రూ.25వేల వరకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అప్పుడే అడ్మిషన్ల వేట!
పదో తరగతి పరీక్షలు మొదలే కాలేదు.. ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రచారం షురూ
పరిమిత సీట్లు.. ఫీజులో రాయితీల పేరుతో విద్యార్థులకు వల
మెరిట్ టెస్టుల పేరుతో పరీక్షలు.. తర్వాత తల్లిదండ్రులకు ఫోన్లు


