ప్రభుత్వ స్థలంపై ‘ప్రైవేటు’ కన్ను!
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. బై నంబర్లతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి రూ.45 కోట్ల విలువైన స్థలాన్ని కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థలోని కొంత మంది అధికారులు సైతం వీరికి పరోక్షంగా సహ కరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సరూర్‌నగర్ మండలం కొత్తపేట పాపడం హోటల్ వెనుక భాగంలోని సర్వే నంబర్ 9/1లో 3వేల గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ గజం ధర రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది.
బై నంబర్లు సృష్టించి..
ఇప్పటికే ఇక్కడ 900 గజాలను ఫైర్ స్టేషన్‌కు కేటాయించారు. మిగిలిన 2,100 గజాల స్థలంలో బొమ్మనగండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకునేవారు. నిజానికి ఈ సర్వే నంబర్‌లోని భూమికి గతంలోనే ఏడీ సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఓ రియల్టర్ విలువైన ఈ భూమిపై కన్నేశాడు. 9/1/2 సర్వే నంబర్‌తో క్లెయిమ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి, కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
అది పూర్తిగా ప్రభుత్వ భూమే. ఇప్పటికే కొంత ఫైర్‌స్టేషన్‌కు కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇచ్చాం. మిగిలిన భూమిని ఇతర ప్రజావసరాలకే కేటాయించాలని నిర్ణయించాం. సెంటు కూడా వదిలేది లేదు. అవసరమైతే కోర్టుల్లో ప్రభుత్వం తరపున గట్టిగా కొట్లాడటానికి సైతం వెనుకాడబోం.
– వేణుగోపాల్, తహసీల్దార్, సరూర్‌నగర్
సరూర్‌నగర్ సర్వే నంబర్ 9/1లో 3వేల గజాల సర్కార్ భూమి
బై నంబర్లతో కాజేసేందుకు ప్రయత్నాలు
పావులు కదుపుతున్న రియల్టర్లు


