సర్వైకల్‌పై టీకాస్త్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్) కేన్సర్‌కు కారణమైన హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)పై టీకాస్త్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. వైరస్‌ను నిర్వీర్యం చేసే టీకాను ఉచితంగా ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని 24 పట్టణ, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా 77 బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న 3,300 మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న బాలికలు 1.17 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఒక్కో బాలికకు ఒక డోసు చొప్పున(0.5 ఎంఎల్)టీకాను ఎడమ చేతికి ఇవ్వనున్నారు. ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వైరస్(83 శాతం రక్షణ ఇస్తుంది)ను దరిచేరనీయదని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న కేసులు
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఓపీలో రోజుకు సగటున వందకుపైగా కొత్త కేన్సర్ కేసులు వస్తుండగా, వీటిలో 40 శాతం సర్వైకల్ కేన్సర్ కేసులే. ఇక్కడ ఏటా 10 నుంచి 12 వేల మందికి చికిత్స అందిస్తుండగా, వీటిలో 13 శాతం మంది గర్భాశయముఖ ద్వార కేన్సర్‌తో బాధపడుతున్నారు. హెచ్‌పీవీ మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు కారణమవుతోంది. మహిళల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారిన ఈ సర్వైకల్ కేన్సర్‌కు హెచ్‌పీవీ టీకాతో చెక్ పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఆ మేరకు అన్ని పట్టణ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సహా బస్తీ దవాఖానాల్లోనూ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేసులను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే అవకాశం ఉంది. అదే సెకండ్ స్టేజీలో గుర్తిస్తే 80 శాతం అవకాశం ఉంటుంది. మూడో దశలో 40 శాతం, నాలుగో దశలో 15 శాతం మాత్రమే కాపాడేందుకు అవకాశం ఉంటంది. అవగాహన లోపంతో చాలా మంది దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక వేళ అనుమానించినా మెజార్టీ మహిళలు అవమానంగా భావించి బయటికి చెప్పుకోలేక పోతున్నారు. తీరా ప్రాణాల మీద కొచ్చిన తర్వాత చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్నారు. ఆ దశలో వైద్యులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. కీమో, రేడియేషన్ థెరపీలు, సర్జరీలు చేసినా ఫలితం ఉండటం లేదు.
గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు చెక్
బాలికల భవిష్యత్‌పై వైద్యారోగ్యశాఖ నజర్
జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి
జిల్లాలో 1.17 లక్షల మంది బాలికలకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు అంచనా
జిల్లాలో 376 కేసులు
దేశంలో ఏటా 1.30 లక్షల కేన్సర్ కేసులు నమోదవుతుండగా, వీటిలో 70 శాతం కేసులు ఫోర్త్‌స్టేజీలో గుర్తించినవే. ఫలితంగా ఏటా 77,348 మంది కేన్సర్‌తో మృత్యువాతపడుతున్నారు. ఎన్‌సీడీ సర్వే ద్వారా జిల్లాలో 376 కేన్సర్ కేసులను గుర్తించారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో ఫస్ట్ డోసు కీమో థెరపీ పూర్తి చేసుకున్న వారిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని డే కేర్ కేన్సర్ కీమో థెరపీ సెంటర్‌కు తరలించి వారికి అక్కడే రెండో డోసు కీమో చికిత్సలు అందిస్తున్నారు. దీంతో ఒక్కో బాధితురాలికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లబ్ధి చేకూరుతోంది. ఇలా ప్రతి రోజూ పది నుంచి 15 మంది బాధితులకు ఇక్కడ కీమో సేవలు అందిస్తున్నారు. ప్రైవేటులో రూ.2 వేల నుంచి రూ.9 వేల వరకు ఖరీదు చేసే ఈ టీకాలను వైద్య ఆరోగ్యశాఖ ఉచితంగా అందజేయనుంది. ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరుసగా 90 రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది.


