సాక్షి, హైదరాబాద్: ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధలో.. బలవన్మరణానికి పాల్పడి తమ కుటుంబాల్లో విషాదం నింపారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
హయత్ నగర్ పీఎస్ పరిధి బ్రహ్మణపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్‌లోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. అది గమనించిన కొందరు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని మేడిపల్లి గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది.
మేడిపల్లి గ్రామానికే చెందిన పూజ(17) నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్-పూజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి మృతిని తట్టుకోలేకనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే..
ఈ ఇద్దరూ గతంలోనూ సూసైడ్ అటెంప్ట్ చేసినట్ల తేలింది. రెండు నెలల కిందట ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆ తర్వాత ఏమైందో తెలీయదుగానీ.. వెనువెంటనే ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


