చికిత్స పొందుతూ బాలిక మృతి
మంచాల: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందారు. పోలీసులు కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీ.వీ.పల్లె గ్రామానికి చెందిన ఈడిగ సరస్వతి, రవి దంపతులకు ఓంప్రకాశ్ కుమారుడు, అంజలి(15) కూతురు ఉన్నారు. ఓంప్రకాశ్ మండలంలోని నోముల పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. శనివారం కుమారుడిని చూసేందుకు తల్లి సరస్వతితో పాటు అంజలి కూడా వచ్చింది. తిరుగు ప్రయాణంలో నోముల వద్దకు రాగానే ఇబ్రహీంపట్నం నుంచి మంచాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంజలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలో లిమ్స్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ వైద్యశాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
చేవెళ్ల: భర్తతో తలెత్తిన మనస్పర్ధలతో చెరువులో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన అశిగారి మనీష(28), నర్సింలు భార్యాభర్తలు. శనివారం రాత్రి నర్సింలు మార్కెట్‌కు వెళ్లాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని మనీష కోరింది. ఈ క్రమంలో ఏమైందోగాని నర్సింలు అర్ధరాత్రి వచ్చి చూసే సరికే ఆమె కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం నాగుల చెరువులో మృతదేహం కనిపించినట్లు స్థానికులు చెప్పడంతో పోలీసులు పరిశీలించి మనీషగా నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో న్యాయ విద్యార్థి మృతి
మేడ్చల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో నల్సార్ న్యాయ విద్యార్థి మృతి చెందిన సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలొ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రియాంశు కుమార్ మీనా, సాక్షమ్, గోపీచంద్ లు ద్విచక్ర వాహనంపై శనివారం రాత్రి శామీర్‌పేట్ నుండి నల్సార్ వైపు వెళుతున్నారు. మార్గమధ్యలోని పెద్దమ్మ కాలనీ వద్ద ఎలాంటి సంకేతాలు లేకుండా ఓ ట్రక్ రోడ్డుపై నిలిపి ఉండడంతో గమనించని విద్యార్థులు ట్రక్‌ను ఢీకొని కిందపడ్డారు. అదే సమయంలో శామీర్‌పేట్ వైపు వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ రోడ్డుపై పడి ఉన్న సాక్షమ్(21) తలపై నుండి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి ప్రియాంశు కుమార్ మీనా గాయాలపాలయ్యాడు. పోలీసులు సాక్షమ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రోడ్డుపై ఎలాంటి సంకేతాలు లేకుండా పార్క్ చేసిన ట్రక్, అతివేగంగా వచ్చి విద్యార్థి పై నుండి వెళ్లిన వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


