జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

Feb 23 2026 9:16 AM | Updated on Feb 23 2026 9:16 AM

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

బంజారాహిల్స్‌: వేగంగా దూసుకెళ్తున్న ఓ ఫెరారీ కారు బ్రేక్‌ ఫెయిలై స్టీరింగ్‌ లాక్‌ కావడంతో అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొని మరో కారును ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లో నివసించే యువ వ్యాపారి ఈమని క్రాంతిరెడ్డి (30) తన భార్య శిరీషతో కలిసి ఆదివారం ఉదయం తన ఫెరారీ కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 మీదుగా ఫ్లైఓవర్‌ పక్క నుంచి కొండాపూర్‌ వైపు ఓ పెళ్లికి వేగంగా దూసుకెళ్తున్నాడు. కొద్దిసేపటికే కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో పాటు స్టీరింగ్‌ లాక్‌ అయింది. దీంతో కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి, మరో కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న పీయూష్‌వర్మ, మరో ఇద్దరు యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. క్రాంతిరెడ్డి, ఆయన భార్య శిరీషకు కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. పీయూష్‌ నడుపుతున్న కారు సడెన్‌గా ఆగిపోవడంతో వెనుక వస్తున్న సెలోరో కారు ఢీకొట్టింది. సెలోరో కారు వెనుక వచ్చిన బుల్లెట్‌ బైక్‌ సెలోరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం క్షణాల్లోనే జరిగిపోయింది. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో ఏడుగురి వరకు గాయపడ్డారు. క్రాంతిరెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించగా మద్యం తీసుకోలేదని తేలింది. బాధితుడు పీయూష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రాంతిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మూడు కార్లు, ఒక బుల్లెట్‌ వాహనం ధ్వంసం కాగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఫెరారీ కారు ఎందుకు ప్రమాదానికి గురైనదో ఎంవీఐకు లేఖ రాస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement