రీజియన్లకు స్వయం ప్రతిపత్తి | - | Sakshi
Sakshi News home page

రీజియన్లకు స్వయం ప్రతిపత్తి

Feb 23 2026 9:16 AM | Updated on Feb 23 2026 9:16 AM

రీజియన్లకు స్వయం ప్రతిపత్తి

రీజియన్లకు స్వయం ప్రతిపత్తి

సాక్షి, సిటీబ్యూరో: మహా నగరవాసులకు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సేవలను మరింత చేరువ చేసేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. అధికారాలను కేంద్రీకృతం చేయకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి వీలుగా మూడు స్వతంత్ర ప్రాంతీయ విభాగాలు (రీజియన్‌)గా పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రీజియన్లకు మరిన్ని ఆర్థిక, పరిపాలనా అధికారాలను కట్టబెట్టేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఏ చిన్న పని కావాలన్నా ప్రధాన కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ (సెంట్రల్‌), సైబరాబాద్‌, మల్కాజిగిరి రీజియన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఈడీ)కు కీలక అధికారాలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు విధి విధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది.

రూ.లక్ష దాటిన పనులకు రీజియన్‌ పరిధిలోనే..

ఒక్కో రీజియన్‌్‌ పరిధిలో నెలవారీగా రూ.50 లక్షల వరకు విలువైన కొత్త పనులను మంజూరు చేసే అధికారాన్ని ప్రాంతీయ స్థాయిలోనే ఈడీలకు కల్పించనున్నారు. రూ.80వేల లోపు విలువైన అత్యవసర పనులను టెండర్లు లేకుండానే నామినేషన్‌ పద్ధతిపై చేపట్టేందుకు, రూ.లక్ష దాటిన పనులకు రీజియన్‌్‌ స్థాయిలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందిస్తోంది.

నల్లా కొత్త కనెక్షన్లు ఇక సులభం

సామాన్య వినియోగదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. కొత్తగా నల్లా కనెక్షన్లు తీసుకోవాలంటే ఇక నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సాధారణ ఇంటి కనెక్షన్ల నుంచి, 20 ఫ్లాట్లు ఉండే ఎంఎస్‌బీ (అపార్ట్‌మెంట్‌) వరకు కనెక్షన్లను మంజూరు చేసే అధికారాలు రీజియన్‌న ఈడీలకే అప్పగించాలని జలమండలి పరిశీలిస్తోంది. కేవలం కనెక్షన్లే కాకుండా, నెల వారీ బిల్లుల వసూళ్లు, వాటర్‌ అండ్‌ సీవరేజీ లైన్ల ని ర్వహణను కూడా రీజియన్‌ స్థాయిలోనే పర్యవేక్షించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వికేంద్రీకరణతోనే సేవల్లో పారదర్శకత

ప్రస్తుతం జలమండలి పరిధి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన నేపథ్యంలో పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు వికేంద్రీకరణ అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చిన్నపాటి పనులు, మరమ్మతులు, పైపులైన్‌ లీకేజీల వంటి సమస్యలు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారమవుతాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

నెలవారీగా రూ.50 లక్షల విలువైన పనులు

సాధారణ ఇంటి నుంచి ఎంఎస్‌బీ కనెక్షన్ల వరకు మంజూరు

త్వరలో వెలువడనున్న అధికారిక ఉత్తర్వులు

జలమండలిలో వికేంద్రీకరణ విప్లవం

Advertisement
 
Advertisement
Advertisement