వెనుజులాపై అమెరికా దాడి సరికాదు
ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్
హుడాకాంప్లెక్స్: వెనిజులా దేశ సార్వభౌమత్వాన్ని హరించేవిధంగా, అధ్యక్షుడు నికోలస్ మడూరో, ఆయన కుటుంబ భద్రతకు ముప్పుగా మారిన అమెరికా సైనిక చర్యలను నిరసనకారులు తీవ్రంగా ఖండించారు. శాంతి కోసం, అధ్యక్షుడు మడూరోను వెంటనే విడుదల చేయాలని, వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆపాలంటూ నినాదాలు చేశారు. సరూర్‌నగర్‌లో చేప్టిన ఈ కార్యక్రమంలో ఇస్కఫ్(ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్) రాష్ట్ర అధ్యక్షుడు రేఖల గోపాల్ మాట్లాడుతూ.. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, అధ్యక్షుడు నికోలస్ మడూరో, ఆయన కుటుంబాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా దాడిని తాము వ్యతిరేకిస్తున్నామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని ఆయన అన్నారు. సామ్రాజ్యవాద శక్తుల అన్యాయ చర్యలను అడ్డుకోవడానికి ప్రపంచం ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


