ప్రతిపక్షాలది దుష్ప్రచారం
చేవెళ్ల: గ్రామాల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించటం, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీ రామ్ జీ అనే పథకాన్ని తీసుకు వచ్చిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకానికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం అమలైతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని గ్రహించి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చలేదని, కొత్త పథకాన్ని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ పథకానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయన్నారు. ఈ పథకంతో పేదలకు మరింత లాభం చేకూరే విధంగా ఉండాలనే మోదీ కొత్త పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, నాయకులు కుంచం శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, శర్వలింగం, కృష్ణాగౌడ్, అశోక్, పత్తి సత్యనారాయణ, జయశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


