రైతులకు న్యాయం చేయండి
షాబాద్: ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్రతిగా ఇవ్వాల్సినవి ఇచ్చి న్యాయం చేయాలని శాసనమండలిలో సోమవారం చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తావించారు. షాబాద్ మండలంలో పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితిని వివరించారు. పారిశ్రామిక ప్రగతి కోసం మండలంలో సుమారు 3వేల ఎకరాల ప్రభుత్వ భూమిని 2వేల మంది రైతుల నుంచి సేకరించి కంపెనీలకు అప్పగించడం జరిగిందన్నారు. చందనవెల్లిలో 650 మంది రైతుల నుంచి 1,200 ఎకరాలు, సీతారాంపూర్‌లో 600 మంది నుంచి 1,150 ఎకరాలు, హైతాబాద్, మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతుల నుంచి 500 ఎకరాలు, పెద్దవేడు గ్రామానికి చెందిన 70 మంది రైతుల నుంచి 150 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. వాటిలో వెల్స్‌పన్, ఆమేజాన్ లాంటి బడా కంపెనీలు పరిశ్రమలు స్థాపించాయన్నారు. భూములు కోల్పోయే సమయంలో రైతులకు ఎకరా భూమికి ఒక గుంట, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.


