ప్రెస్‌నోట్ జాప్యంపై గందరగోళం
లాంగ్‌స్టాండింగ్ అధికారులపై నిఘా
బినామీలు, ఆస్తుల వివరాలపై ఆరా
పోలీసు, బల్దియా, రెవెన్యూ విభాగాలపై స్పెషల్ ఫోకస్
కరీంనగర్ బల్దియాలో సోదాలతో అధికారుల్లో పెరిగిన టెన్షన్
ఏసీబీ ప్రెస్‌నోట్ జాప్యంపై విమర్శలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏసీబీ సోదాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి ఇవి ఆకస్మిక తనిఖీలని చెబుతున్నా.. దీనివెనక తీవ్రమైన కసరత్తే జరిగింది. కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లాలోని అవినీతి అధికారులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారుల వ్యవహారాలపై రహస్యంగా ఆరా తీస్తోంది. ఒకే జిల్లాలో.. జిల్లా కేంద్రాల్లో.. మరీ ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకేంద్రంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అనేకమంది ప్రభుత్వ అధికారుల డేటాను సేకరించింది. వారి ఆస్తులు, బినామీ వివరాలపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
రెవెన్యూ, బల్దియా, పోలీస్ విభాగాల్లో..
ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా ఒకేస్థానంలో పనిచేస్తున్న వారి జాబితా ఏసీబీ వద్ద ఉంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్‌విభాగాల్లో పదేళ్లుగా బదిలీలు లేకుండా ఉన్న అధికారుల్లో అవినీతిపరుల సమాచారం వెలికి తీయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తున్న అధికారులంతా ఇలాంటి జాబితాకు చెందినవారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఉమ్మడిజిల్లాకు సంబంధించి ఏసీబీ రూపొందించిన జాబితాలో పలువురు సీనియర్ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉండటం గమనార్హం. వీరి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ దొరికినా.. ఎరవేసి పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఏసీబీ జరిపిన దాడులు సీనియర్ అధికారుల గుండెల్లో దడ రేపుతున్నాయి.
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ సోదాలు లేదా అరెస్టులు జరిగినపుడు గంటల వ్యవధిలోనే అధికారికంగా ప్రెస్‌నోట్ విడుదలవుతుంది. కానీ.. మంగళవారం బల్దియా కార్యాలయంలో జరిగిన సోదాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో పలు అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ.. తనిఖీలు జరిగిన దాదాపు 24 గంటల తరువాత ప్రెస్‌నోట్ విడుదల చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. బల్దియా అధికారులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో పలువురు ఏసీబీ అధికారులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. దీంతో బుధవారం సాయంత్రం నాలుగు గంటలు దాటిన తరువాత ఏసీబీ కరీంనగర్ కార్పొరేషన్ తనిఖీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.


