● జలసిరి పనులు చేపట్టాలి ● అపరాల సాగుపై అవగాహన కల్పించాలి ● సీఎమ్మార్ గడువులోగా ఇవ్వాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/బోయినపల్లి(చొప్పదండి):జిల్లాలో చేయూ త పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, స్వీకరణకు ఈ నెల 31వ తేదీ తుది గడువని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఎంపీడీవోలు, వ్యవసాయ, గృహనిర్మాణశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేయూత పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు మున్సిపాలిటీలు, ఎంపీడీవో ఆఫీస్‌ల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఇంది రమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలన్నారు. జలసిరి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. లాభదాయకమైన అపరాల సాగును ప్రోత్స హించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జెడ్పీ సీఈవో, పీడీ హౌసింగ్ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేశ్ పాల్గొన్నారు.
బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు
జిల్లాలో గత మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ గడువులోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో బకాయిలు చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఆయిల్ పాం సాగు లక్ష్యం చేరుకోవాలన్నారు. 2026– 27 సంవత్సరానికి నిర్దేశించిన మొక్కలను నాటించాలన్నారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. బోయినపల్లి పీహెచ్‌సీలో మహిళా సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ–ఆరోగ్యం యాప్ ద్వారా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మండలంలోని 819 స్వయం సహాయక సంఘాల్లో 9,424 మంది సభ్యులు ఉన్నారని, వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని రేషన్‌షాపును తనిఖీ చేశారు. బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో ఏంజెలా అల్ఫ్రెడ్, తహసీల్దార్ ఎండీ. రీఫ్ మోహియొద్దీన్ పాల్గొన్నారు.


