మృత్యుబావులు..! | - | Sakshi
Sakshi News home page

మృత్యుబావులు..!

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

రోడ్డు పక్కన వ్యవసాయ బావులు ప్రమాదాలకు నిలయాలు సూచికలు ఏర్పాటు చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం

జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట ప్రయాణించే వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్త.. కాస్త ఏమరుపాటుగా ఉన్నారో రోడ్ల వెంట నోళ్లు తెరుచుకుని ఉన్న వ్యవసాయబావులు మింగేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని ప్రతీ మండలంలో రోడ్డు పక్కన బావులు ప్రమాదకరంగా ఉండగా.. వాటికి రక్షణ గోడలు ఏర్పాటు చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. పలువురు రైతులే సొంతంగా హద్దురాళ్లు ఏర్పాటు చేసుకుంటుండగా.. అవి ప్రమాదాలను నిలువరించలేవని, రాత్రి సమయాల్లో కనిపించేలా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనాదారులు కోరుతున్నారు.

ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రోడ్ల వెంట ఉన్న వ్యవసాయ బావులకు రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు లేవు. ఏడాది క్రితం పెద్ద లింగాపుర్‌లో రోడ్డువెంట ఉన్న వ్యవసాయబావిలో పడి ద్విచక్రవాహనదారుడు చనిపోయాడు. దాచారం గ్రామంలో ఓ చోట రోడ్డుకు రెండు వైపులా వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి. అనంతారంలో రోడ్డు పక్కన వ్యవసాయ బావి రక్షణ గోడ లేకుండా ఉంది. ఇల్లంతకుంట నుంచి రహీంఖాన్‌పేటకు వెళ్లే దారిలో వ్యవసాయ బావికి రక్షణగా కర్రలు పెట్టి, చీరలు కట్టారు.

చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం మర్రిగడ్డ– జోగాపూర్‌, కిష్టంపేట, రామారావుపల్లె, సనుగుల, జలపతి తండా వరకు రోడ్డు పక్కనే పదుల సంఖ్యలో బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. బావి దరి కూలిపోయి, చెట్ల కొమ్మలు కమ్ముకోవడంతో ఆనవాళ్లు కనిపించడం లేదు. 2016 నవంబర్‌ 2న చందుర్తి శివారులోని ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే ఉన్న బావిలో కట్టలింగంపేట గ్రామానికి చెందిన ఆవారి రాజేశం కారుతో సహా బావిలో పడి చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన బావిని గ్రామస్తులు పూడ్చివేశారు.

సిరిసిల్లఅర్బన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దబోనాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న బావులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. పెద్దబోనాల నుంచి సిరిసిల్ల ప్రతి రోజు వందలాది వాహనాలు, ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తూ వెళ్తుంటారు. చాలా మంది రాత్రిపూట ఈ దారి గుండా ప్రయా ణం చేస్తుంటారు. ప్రమాదాలు జరగకుండా బావుల చుట్టూ పటిష్టమైన రక్షణ గోడలు, గ్రిల్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement