వేములవాడఅర్బన్: అగ్రహారంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే రోబోటిక్స్ వర్క్‌షాప్‌లలో ట్రైనర్లుగా సేవలందించేందుకు కళాశాల విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ ఉద్దేశ్యమని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శిక్షణలో 186 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. రోబోటిక్స్ పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అలవడుతాయన్నారు.
సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల పాలనకు వ్యతిరేకంగా సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ శివారులోని సింగిరెడ్డి భూపతిరెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి ఈ యాత్రను ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 14 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ పాదయాత్రలు సాగుతాయని తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, పంతం రవి, కడారి రాములు, చీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మంద అనిల్, బాచుపల్లి శంకర్, కృష్ణ, హరి, సత్తవ్వ, మంజుల పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఫీజు, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం నిరసన తెలిపారు. పట్టణంలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ జిల్లా కో కన్వీనర్ వంగ అనిల్‌కుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, రాజు, చిందం నరేశ్, మెహర్ కృష్ణ పాల్గొన్నారు.
పల్లెప్రకృతి వనంలో చెట్ల నరికివేత
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గోపాలరావుపల్లి పరిధిలోని ‘పల్లె ప్రకృతి వనం’లో అనుమతి లేకుండా 61 మొక్కలను నరికివేసినందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ రూ.1.22లక్షలు జరిమానా విధించారు. వాల్టా చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కో మొక్కకు రూ.2వేలు చొప్పున జరిమానా ఖరారు చేశారు. ఈ జరిమానా మొత్తాన్ని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల నుంచి సంయుక్తంగా వసూలు చేసి 14 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాలో జమచేయాలని స్పష్టం చేశారు.
ఆరు మండలాల్లో చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలోని ఆరు మండలాల్లో గురువారం చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలంలో 16.2 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 3.3, సిరిసిల్లలో 7.5, తంగళ్లపల్లిలో 5.6, ఇల్లంతకుంటలో 6.0, ముస్తాబాద్‌లో 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో తుంపర్ల వర్షం పడింది.


