● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ
సిరిసిల్లటౌన్: పుట్టిన శిశువుకు ముర్రుపాలు అమృతంతో సమానమని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పేర్కొన్నారు. స్థానిక 17వ వార్డులో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో మాట్లాడారు. ముర్రుపాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు. కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి నీరజ, దార్నం అరుణ, బత్తుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డులో కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో జాతీయ అవార్డు గ్రహీత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పాల్గొన్నారు.
తరగతి గదిలో ఈవీఎంలపై నివేదిక
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతిగదిలో ఎనిమిదేళ్లుగా ఈవీఎంలు ఉంటున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. ‘పాఠాలు వినేదెలా’ శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 3న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. 2018 నాటి ఎన్నికల కేసు కోర్టులో విచారణలో ఉండగా.. ఈవీఎంలతో తరగతి గదులు విద్యాబోధనకు దూరంగా ఉంటున్నాయని కథనం రావడంతో జిల్లా ఇంటలిజెన్స్ అధికారులు వాస్తవాలను వివరిస్తూ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. కళాశాలలో విద్యాబోధనకు ఆటంకంగా మారిన తీరుపై ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్ జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఎనిమిదేళ్లుగా ఇంటర్ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై ‘సాక్షి’ కథనంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు.


