జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వేములవాడలో ట్యాంక్‌బండ్, బస్టాండ్ పనులు..
రగుడు కూడలిలో అభివృద్ధి పనులు ప్రారంభం
కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
వర్షాలు కురవాలి.. రైతులు బాగుపడాలి
సిరిసిల్ల: నేతన్నలు గర్వపడేలా సిరిసిల్ల కూడలిని అభివృద్ధి చేశారని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద రూ.3.22 కోట్లతో కూడలి అభివృద్ధి, సుందరీకరణ పనులను మోడల్ బస్‌షెల్టర్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించేందుకు గత రెండేళ్లలో రూ.1,360 కోట్లు అందించామన్నారు. జిల్లాలో నూలు డిపోను ఏర్పాటు చేశామన్నారు.
సిరిసిల్ల ప్రత్యేకతను చాటేలా..
రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళాశక్తి చీరలు తయారవుతున్నాయన్నా రు. అందుబాటు ధరలో మోడల్ చీరను తయారు చేసి.. జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలన్నారు.
అభివృద్ధికి పూర్తి సహకారం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.
నాణ్యమైన చీరల ఉత్పత్తికి శ్రీకారం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25లో 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది మరో 3 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చామన్నారు. మరో 3 కోట్లకు పైగా మీటర్ల చీరల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఇటీవల రూ.62కోట్ల బిల్లులు చెల్లించామని, 25 హెచ్‌పీ పవర్‌లూమ్‌లకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేస్తున్నామని వివరించారు.
భక్తులు సేదతీరేలా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు సేదతీరేలా గుడిచెరువు బండ్ పార్క్ పనులు చేశామన్నారు. రగుడు కూడలి సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ చేసినట్లు తెలిపారు. త్రిఫ్ట్ ఫండ్ పథకంలో నేతన్నలకు ఆర్‌డీ కార్డులను పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్‌పర్సన్ స్వరూప, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేములవాడ/వేములవాడఅర్బన్: సమృద్ధిగా వర్షాలు కురిసి.. రైతులు బాగుపడాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. వేములవాడలో గురువారం వరుణయాగానికి హాజరవడంతోపాటు గుడిచెరువుపై పలు అభివృద్ధి పనులను రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్‌కుమార్ హాజరయ్యారు. వీరికి విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే స్వాగతం పలికారు.
ట్యాంక్‌బండ్.. బస్టాండు ఆధునీకరణ పనులు ప్రారంభం
రాజన్న గుడిచెరువు కట్టపై రూ.12కోట్లతో నిర్మించిన ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండును రూ.1.60కోట్లతో ఆధునీకరించే పనులకు శంకుస్థాపన చేశారు. వేములవాడ–బాసర బస్సును ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవాడ బస్టాండ్‌కు నిత్యం 250 బస్సులు..560 ట్రిప్పులు నడుస్తున్నాయన్నారు. రోజుకు 50వేల మంది ప్రయాణిస్తున్నారని వివరించారు. ఈ బస్టాండ్‌ను రూ.1.62 కోట్లతో ఆధునికీరిస్తున్నామని తెలిపారు. ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు.


