‘ముసురు’కున్న వాన అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 81.4 మిల్లీ మీటర్లు పారుతున్న వాగులు, వంకలు
సిరిసిల్ల: జిల్లాలో వాన ముసురుకుంది. ఈ సీజన్‌లో అత్యధిక వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాన మొదలైంది. వర్షం కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పటికే నార్లు పోసి పడిగాపులు కాస్తున్న అన్నదాతలకు ఊపిరినిచ్చింది. పొలాలను రైతులు పొతం చేస్తూ వరినాట్లు వేస్తున్నారు. నార్లు పోసుకోని రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్టాండు నేతన్నచౌక్ వద్ద వరద రోడ్డుపైకి చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంజీవయ్యనగర్, శ్రీనగర్‌కాలనీ, ఆసిఫ్‌పుర ప్రాంతాల్లో వరద రోడ్డుపై పారింది. సిరిసిల్ల శివారు ప్రాంతాల్లో రోడ్లు బురదమయంగా మారాయి. వేములవాడ పట్టణంతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వర్షం నీటితో బురదమయంగా మారాయి.
పారుతున్న వాగులు
పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షంతో పాల్వంచవాగు పారుతోంది. వరదనీరు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి చేరుతోంది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కూడెల్లివాగు పారుతోంది. ఈ రెండు వాగుల వరద ఎగువ మానేరులోకి చేరుతోంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిరికొండ అటవీప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి చేరుతోంది.
ఎల్లారెడ్డిపేటలో అత్యధికం
జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 81.4 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 46 మిల్లీ మీటర్లగా నమోదైంది. గతేడాది ఇప్పటి వరకు 340.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ఈ ఏడాది 282.9 మిల్లీమీటర్లు పడింది. జిల్లాలో సాధారణ వర్షంపాత 343.5 మిల్లీమీటర్లు ఉంది. ఇంకా 18 శాతం లోటు వర్షపాతం ఉంది.
చిగురించిన ఆశలు
గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 31 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 18 ఫీట్లకు చేరింది.
మూలవాగు పరవళ్లు
కోనరావుపేట: మండలంలోని కొండాపూర్ శివారులోని పెంటివాగు ప్రవాహం మూలవాగులో కలవడంతో జలకళ సంతరించుకుంది. మూలవాగు పరవళ్లు తొక్కుతోంది.
పాలన కేంద్రాలు జలదిగ్బంధం!
వేములవాడ: వేములవాడ మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో వర్షం నీరు నిలిచింది. డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతో నీరు బయటకు పోకపోవడంతో నీరు నిలిచింది.
మిడ్‌మానేరుకు ఇన్‌ఫ్లో
బోయినపల్లి: మిడ్‌మానేరులోకి వరద వచ్చి చేరుతోంది. మూలవాగు, మానేరువాగుల్లోంచి ప్రాజెక్టులోకి బుధవారం 4,556 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టు నుంచి 112 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా వెళ్తోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో 7.576 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.
సండ్రవాగుకు జలకళ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని అంకుసాపూర్ శివారులోని సండ్రవాగుకు జలకళ వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులోకి వరద చేరుతోంది.
పొంగుతున్న లేతమామిండ్ల వాగు
ఎల్లారెడ్డిపేట: మండలంలోని అక్కపల్లి శివారులోని లేత మామిండ్లవాగు వంతెన పైనుంచి పొంగిపొర్లుతోంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిట్టివాగు, పాలేటివాగులకు వరద చేరుతోంది.
కూలిన ఇల్లు
మండల కేంద్రానికి చెందిన కోనేటి మల్లయ్య ఇల్లు వర్షం ధాటికి కూలింది. ఇంటి పై కప్పు ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.
చెరువులకు జలకళ
వీర్నపల్లి: మండలంలోని మద్దిమల్ల పరిధిలోని రాయిని చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వన్‌పల్లి, గర్జనపల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగుల పరిసర ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థ ఇళ్లలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలంలో వరినాట్లు జోరందుకున్నాయి. వర్షంలోనూ వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు.
రుద్రంగి: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు పొలాలు దున్నుతున్నారు. మరికొందరు రైతులైతే వరినాట్లు వేస్తున్నారు.
వర్షపాతం ఇలా..
మండలం వర్షం(మి.మీ)
ఎల్లారెడ్డిపేట 81.4
రుద్రంగి 42.0
చందుర్తి 36.5
వేములవాడరూరల్ 37.5
బోయినపల్లి 33.6
వేములవాడ 32.7
సిరిసిల్ల 43.6
కోనరావుపేట 57.2
వీర్నపల్లి 56.1
గంభీరావుపేట 60.0
ముస్తాబాద్ 27.6
తంగళ్లపల్లి 55.5
ఇల్లంతకుంట 34.4
ఫీడర్ చానల్ పరిశీలన
వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని మల్లారం ఫీడర్ చానల్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నక్కవాగు హన్మాజిపేట మీదుగా మల్లారం ఫీడర్ చానల్ నుంచి ప్రవహిస్తోంది. ఫీడర్ ఛానల్ దెబ్బతినడంతో గుడి చెరువులోకి నీరు రాకుండా వృథాగా పోతోంది. ఫీడర్‌చానల్‌ను మరమ్మతు చేస్తామని విప్ హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, సర్పంచులు సంగెం అర్పిత, రంగు వెంకటేశంగౌడ్, సామ తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, నాయకులు వీరారెడ్డి, మల్లేశం, చిలుక ప్రభాకర్ ఉన్నారు.


