వేములవాడ: వర్షాలు సమృద్ధిగా కురవాలని వేములవాడ భీమన్న ఆలయంలో వరుణయాగం గురువారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ యాగంలో భాగంగా రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 1 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతయాని ఈవో రమాదేవి తెలిపారు.
సిరిసిల్ల అర్బన్: ప్రకృతి విపత్తుల వేళ ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణను గురువారం ప్రారంభించినట్లు బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ తెలిపారు. సర్ధాపూర్ 17వ బెటాలియన్‌లో సిద్దిపేట పోలీసు కమిషనరేట్ సిబ్బందికి మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో 31 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు.
వేములవాడఅర్బన్: మానవ అక్రమ రవాణా తీవ్రమైన సామాజిక నేరమని ఐసీడీఎస్ సీడీపీవో సౌందర్య పేర్కొన్నారు. వేములవాడలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అమాయక మహిళలు, బాలికలను ఉద్యోగాలు, సినిమా అవకాశాలు అంటూ మోసగిస్తారన్నారు. సోషల్‌మీడియాలో ఏర్పడే పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, టీచర్లకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, బలవంతంగా ఎక్కడికై నా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలపాలన్నారు. 1098, పోలీస్ –100 సేవల గురించి వివరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శశికళ, త్రివేణి, దేవిక, అర్చన, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ మమత, ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ అధ్యాపకుడు, బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పర్శరాములుకు జాతీయస్థాయి పురస్కారం దక్కింది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 29న ఢిల్లీలో నిర్వహించిన తెలుగు–వెలుగు సంబరాలు–2026–సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభ పురస్కారం అందజేశారు. కేంద్ర ఉక్కు గనులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతులమీదుగా అందుకున్నారు.
సిరిసిల్ల: పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌గా గోపాల్ గురువారం విధుల్లో చేరారు. మొన్నటి వరకు జిల్లా మేనేజర్‌గా పనిచేసిన నర్సింహారెడ్డిని అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జి జిల్లా మేనేజర్‌గా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు అదనపు బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా జిల్లా మేనేజర్‌గా గోపాల్‌ను నియమించడంతో విధుల్లో చేరారు.


