కార్గిల్‌ కీర్తి.. యువతకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ కీర్తి.. యువతకు స్ఫూర్తి

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

కార్గిల్‌ కీర్తి.. యువతకు స్ఫూర్తి

సిరిసిల్ల: అది... 1999. ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భీకరయుద్ధం. భారత భూభాగంలోకి పాకిస్థాన్‌ ప్రేరేపిత చొరబాటుదారులు చొరబడ్డారు. భారత సైన్యం వీరోచిత పోరాటం సాగించింది. రెండు నెలలపాటు సాగిన భీకర యుద్ధంలో సుమారు 500 మంది భారత జవానులు అసువులు బాశారు. కార్గిల్‌ పర్వత శ్రేణులను ఆక్రమించిన పాకిస్థాన్‌ చొరబాటుదారుల నుంచి మన భూభా గాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. భారత సైన్యం విజయం సాధించిన రోజు జూలై 26. మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా, భారత జవానుల త్యాగానికి చిహ్నంగా ఏటా జూలై 26ను కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహిస్తారు. 27 ఏళ్ల కిందట జరిగి న కార్గిల్‌యుద్ధంలో పాల్గొన్న వైజయంతి యుద్ధ ట్యాంక్‌ను 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేశారు.

కార్గిల్‌ లేక్‌గా వర్ధన్‌కుంట

సిరిసిల్లకు పశ్చిమదిశలో ఊరిలోకి ప్రవేశించే దారి లోనే వర్ధన్‌కుంట ఉంది. వర్ధన్‌కుంటకు కార్గిల్‌లేక్‌గా 2002లో నామకరణం చేశారు. కార్గిల్‌యుద్ధంలో అమరుల స్ఫూర్తిగా వైజయంతి యుద్ధ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు అప్పటి భారత రక్షణశాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్‌, రక్షణశాఖ అధికారులతో చర్చించి యుద్ధ ట్యాంక్‌ ఏర్పాటుకు కృషి చేశారు. మున్సిపల్‌ అప్పటి చైర్మన్‌ ఆడెపు రవీందర్‌ గద్దె నిర్మాణానికి అప్పట్లో రూ.4లక్షలు వెచ్చించారు. 40 టన్నుల బరువైన ఆ యుద్ధ ట్యాంక్‌ను ఢిల్లీ నుంచి సిరిసిల్లకు తెప్పించేందుకు అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఢిల్లీకి వెళ్లారు.

అభివృద్ధికి అడుగులు

కార్గిల్‌లేక్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యానవనం, బోటింగ్‌ సదుపాయం, కుర్చీలు, విశ్రాంతి బెంచీలు, వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. లేక్‌ సమీపంలోనే సాయిబాబా, అయ్యప్ప ఆలయాలు ఉండడంతో పర్యాటక శోభ వస్తుందని ఆశించారు. కానీ చాలా కాలంగా నిర్లక్ష్యపు జాడలు కనిపిస్తున్నాయి. కార్గిల్‌ లేక్‌ అభివృద్ధికి రూ.21.10 లక్షలు కేటాయించి కొన్ని పనులు చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ‘అమృత్‌’ 2.0లో రూ.1.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కార్గిల్‌ లేక్‌ కట్ట మరమ్మతులు, మురికినీటిని కట్టడి చేసే పనులు, డ్రెయినేజీలు, సుందరీకరణ పనులు చేపట్టారు. ఇటీవల కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణితో కలిసి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

నేటి తరానికి స్ఫూర్తి

వైజయంతి యుద్ధట్యాంక్‌ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పర్యాటక స్థలంగా మార్చితే పట్టణ వాసులకు, కొత్తగా పట్టణానికి వచ్చే వారికి సైనికుల తెగువ స్ఫూర్తినిస్తోంది. కార్గిల్‌ యుద్ధం జరిగిన నాటి సంగతులను గుర్తుకు తెచ్చేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ కార్గిల్‌లేక్‌ ఆత్మహత్యలకు వేదికగా మారింది. కొంతమేరకు భూమి ఆక్రమణలకు గురైంది. చెరువుకట్ట సైతం కబ్జా కోరల్లో చిక్కింది. కబ్జాలు తొలగించి అభివృద్ధి చేస్తే.. సిరిసిల్లకు అదనపు అందం చేకూరనుంది.

సైనికుల విజయ పతాక కార్గిల్‌ లేక్‌

27 ఏళ్ల కిందట పోరాటం

24 ఏళ్ల కిందట వైజయంతి యుద్ధ ట్యాంకర్‌ ఏర్పాటు

ఏటా సిరిసిల్లలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement