వేములవాడ: వేద విద్యావ్యాప్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వేములవాడలో ఐదు ఎకరాలు ఎంపిక చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న క్షేత్రంలో ఐదు రోజులు కొనసాగిన వేద–స్మార్త ఆగమ విద్వత్ సదస్సు శనివారం ముగిసింది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేద, సంస్కృత పాఠశాలల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, అధ్యాపకులకు స న్మానించారు. ఈనెల 21న ప్రారంభమైన ఈ మహోత్సవాలు 25న పూర్తయ్యాయి. ఈవో రమాదేవి, డీఈవో నవీన్ పాల్గొన్నారు.
వేద సంస్కృతి పరిరక్షణ
దేశ నలుమూలల నుంచి వేదపండితులు వేములవాడకు రావడం గర్వకారణమన్నారు. వేద సంస్కృతి పరిరక్షణకు ఏటా మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి వేదాలతోపాటు మరిన్ని శాస్త్రాల పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం
వేములవాడ దేవస్థానంలో అర్చక నియామకాల విషయంలో అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు విప్ తెలిపారు. గతంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నియామక ప్రక్రియలో మొత్తం 191 పోస్టులను భర్తీ చేయగా, వాటిలో వేములవాడకు 21 పోస్టులు కేటాయించగా.. 10 పోస్టులు అనువంశిక అర్చకులకు లభించాయని తెలిపారు. వేములవాడలోని 128 అనువంశిక అర్చక కుటుంబాల నుంచి కనీసం ఒక్కో విద్యార్థిని వేద పాఠశాలలో చేర్పించి వేద విద్యను అభ్యసించేలా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు.
పరీక్షల ఫలితాలు
ఐదు రోజుల వేద–స్మార్త పరీక్షా మహోత్సవాల్లో మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 124 మంది ఉత్తీర్ణత సాధించారు. 40 మంది పరీక్షాధికారులు పరీక్షలను నిర్వహించారు. అనుత్తీర్ణులైన ఆరుగురు విద్యార్థులు నిరుత్సాహపడకుండా వచ్చే ఏడాది మరింత కృషి చేసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయశర్మ, ఈవో రమాదేవి, డీఈవో నవీన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముగిసిన జాతీయస్థాయి వేద–స్మార్త పరీక్షలు
విద్యార్థులకు పట్టాలు.. అధ్యాపకులకు సన్మానం


