ఆడవాళ్లుంటే ఆగని బస్సులు | - | Sakshi
Sakshi News home page

ఆడవాళ్లుంటే ఆగని బస్సులు

Mar 4 2026 7:29 AM | Updated on Mar 4 2026 7:29 AM

● ఆర్డీనరీ స్టాపే.. అయినా ఆపని వైనం ● ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు

ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ కల్పించాలి

● ఆర్డీనరీ స్టాపే.. అయినా ఆపని వైనం ● ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు

గంభీరావుపేట(సిరిసిల్ల): సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై గంభీరావుపేట మండల పరిధిలోని పెద్దమ్మ స్టేజీ వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్టాప్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం అనేక ఎక్స్‌ప్రెస్‌ బస్‌లు రాకపోకలు సాగిస్తున్నా.. అధికారిక బస్టాప్‌ లేకపోవడంతో అవి ఆగడం లేదు. ఫలితంగా ప్రయాణికులు ఆర్డీనరీ బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, ఆర్డీనరీ బస్సులు కూడా కొన్ని సమయాల్లో ‘ఆడ’వాళ్లుంటే ఆగకుండానే వెళ్లిపోతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించాల్సిన వారు సమయానికి గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారు. పెద్దమ్మ స్టేజీ పరిసర గ్రామాలైన గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌, దమ్మన్నపేట, జగదాంబతండా, నాగంపేట, పొన్నాలపల్లె, లక్ష్మీపూర్‌, మల్లుపల్లి, గంభీరావుపేట, లింగన్నపేట, ముచ్చర్ల, నర్మాల తదితర గ్రామాల ప్రజలు సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్‌ వంటి పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్టాప్‌ ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమ్మ స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు హాల్టింగ్‌ కల్పిస్తే ప్రయాణికుల సమస్యలు చాలా వరకు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి ఈ కీలక ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ కల్పించేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఈ అంశంపై పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేన్‌, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సానుకూలంగా స్పందించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.

మండలంలోని అనేక గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రం సిరిసిల్లకు నిత్యం పెద్దమ్మ స్టేజీ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ బస్టాప్‌ లేదు. ఆర్డీనరీ బస్సులు మాత్రమే ఆగుతాయి. అవి కూడా మహిళా ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటే ఆగవు. దీంతో అత్యవసర ప్రయాణికులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు హాల్టింగ్‌ కల్పించేలా చొరవ తీసుకోవాలి. – దోసల శంకర్‌, గంభీరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement