కలెక్టరేట్‌లో కనిపించని బోర్డులు మూడు అంతస్తులతో ముప్పుతిప్పలు పనిచేయని సీసీ కెమెరాలు సమయపాలన పాటించని అధికారులు
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో పట్టుకోవడం ఓ పజిల్. ఒక్క ఆఫీస్‌కు కూడా బోర్డు లేకపోవడంతో అది ఎవరిదో తెలియక వివిధ పనులపై వచ్చే సామాన్యులు తికమక పడుతున్నారు. 2021 జూలై 4న కలెక్టరేట్ సముదాయాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అప్పటి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్‌ను ప్రారంభించి నాలుగేళ్ల ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఆఫీస్ ఏ అంతస్తులో.. ఏ నంబరు గదిలో ఉందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
● దరిచేరని అన్ని శాఖలు
కలెక్టరేట్‌లో 45 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానమైన రెవెన్యూ, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, మైనింగ్, మాతా శిశు సంక్షేమం వంటి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్ ప్రారంభించగానే వచ్చి తమకు కేటాయించిన చాంబర్‌లో ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల ఆఫీస్‌లు కలెక్టరేట్‌లోకి రాలేదు. తూనికలు–కొలతలు, నీటిపారుదల శాఖల ఆఫీస్‌లు అద్దె భవనాల్లో ఉన్నాయి. డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీస్ కోసం జిల్లా వైద్యాధికారి ఆఫీస్‌లో కొంత భాగం కేటాయించారు. కానీ సీజ్డ్ మెడిసన్, కోర్టు డిపాజిట్ మెడిసిన్ వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని కోసం బయట ఖాళీగా ఉన్న మరో ప్రభుత్వ భవనం కేటాయించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డు రైతు విశ్రాంతి భవనం ఖాళీగా ఉంది. అంతస్తుల వారీగా, బ్లాకుల వారీగా ఆఫీస్ వివరాలను ఎంట్రన్స్‌లో పెట్టాలని సామాన్యులు కోరుతున్నారు.
● పనిచేయని సీసీ కెమెరాలు
కలెక్టరేట్‌లో గతంలో ఏర్పాటు చేసిన 44 సీసీ కెమెరాలు ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. సీసీ కెమెరాల నిఘాలో కలెక్టరేట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వాటిని రిపేరు చేయాల్సిన టెక్నికల్ సిబ్బంది లేకపోవడం, కెమెరాలు ఏర్పాటు చేసిన ఏజెన్సీ పట్టించుకోకపోవడంతో చాలా కెమెరాలు పనిచేయడం లేదు.
● సమయపాలన పాటించని అధికారులు
కలెక్టరేట్‌లోని కొన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదు. సమయానికి ఆఫీస్‌కు వచ్చి ఫేస్ గుర్తింపు పరికరం(ఎఫ్‌ఆర్‌ఎస్) వద్ద హాజరు నమోదు, బయోమెట్రిక్ హాజరు నమోదు ఉన్నా.. కొన్ని శాఖల సిబ్బంది, అధికారులు వేళకు ఆఫీస్‌కు రావడం లేదు. కలెక్టరేట్‌లో అంతర్గత తనిఖీలు పెద్దగా లేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కలెక్టరేట్‌లో ఏ ఆఫీస్ ఏ బ్లాక్‌లో ఉందో వివరించే బోర్డులను ఏర్పాటు చేయాలని గతంలో కలెక్టర్‌గా పనిచేసిన అనురాగ్ జయంత్ ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు బోర్డు సైజు అక్షరాల సైజును నమోదు చేశారు. కానీ వాటి ఏర్పాటుకు నిధులు లేకపోవడంతో ఆగిపోయింది. మరోసారి పీఆర్ అధికారులకు బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ అది మా పరిధి కాదని పెండింగ్‌లో పెట్టారు. అసలు భవనం నిర్మించిన కాంట్రాక్టరే ఆ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టరేట్ పాలనా అధికారులు చొరవ చూపి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


