తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కాలువల నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాలుగో రోజుకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీ కింద ఆర్డీ3, ఎల్‌ఎం6, ఎల్‌ఎం4 కాలువ పనులు పదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీక్షా శిబిరంలోని రైతులకు మద్దతు తెలిపిన బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధిపై గొప్పలు చెబుతున్నారే తప్ప, రైతుల గోసను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముంపు గ్రామాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


