వేములవాడ: వేములవాడ డీఎస్పీగా శ్రీనివాసులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా డివిజన్‌లోని సీఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్‌ను డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా వసంతోత్సవం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పండుగ సందర్భంగా మంగళవారం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకుడు వేణుగోపాలాచారి ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోగు పువ్వుతో చేసిన రంగులను భక్తులపై చల్లి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. శివరామకృష్ణ భజన మండలి భక్తి పాటలతో అలరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రామాలయ చైర్మన్ మోతే లక్ష్మారెడ్డి, హనుమాన్ ఆలయ చైర్మన్ లద్దునూరి హన్మండ్లు, నాయకులు సిరిపురం మహేందర్, సూర నర్సయ్య, తుపాకుల కిషన్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: గౌరిపూర్ణిమ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో బుధవారం నేరెళ్లలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి హరినామ సంకీర్తన, గౌరినితాయ్, కృష్ణ్ణ బలరామ మహా అభిషేకం, గౌరికథ ప్రవచనం, మంగళహారతి, భక్తులకు అన్నప్రసాదం వితరణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిరిసిల్ల నుంచి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఇస్కాన్ ఇన్‌చార్జి ప్రాణనాథ్ అచ్యుత దాస్ ప్రభు తెలిపారు. రాకల గోపీశ్వర్‌దాస్ ప్రభు, భక్త సాగర్ ప్రభు, వీరేందర్ ప్రభు, సాయికృష్ణ ప్రభు, ప్రణీత్ ప్రభు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు మొగ్గు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో పామాయిల్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఆయిల్‌పామ్ మొక్కలు నాటగా ఇప్పుడవి ఎదిగాయి. మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పంటను సాగుచేశారు. మరో ఏడాదిలో ఆయిల్‌పామ్ చెట్ల నుంచి గెలలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మద్దికుంట, గూడెం, మోహినికుంట, బందనకల్, తెర్లుమద్ది తదితర గ్రామాల్లో పంట సాగుకు రైతులు ముందుకొచ్చారు. హర్టికల్చర్ ద్వారా అధికారులు అందిస్తున్న ప్రోత్సాహంతో త్వరలోనే దిగుబడులు సాధిస్తామని రైతులు పేర్కొంటున్నారు. సిద్దిపేటలో ఉన్న మిల్లుకు ఆయిల్‌పామ్ గెలలు సరఫరా చేస్తామని తెలుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఆయిల్‌పామ్ చెట్ల సాగుతో పచ్చదనం పెరిగి చూపరులను ఆకట్టుకుంటోంది.


