● ప్రధానాలయం ఎదుట యాగశాల సిద్ధం ● శివార్చన వేదికపై కల్యాణం
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 5 నుంచి 9 వరకు శివ కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 6న శివ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు గుడి చెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టి, విద్యుత్ దీపాలతోపాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్వామివారికి ఐదు రోజులపాటు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని మేన్‌రోడ్డులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లపై ఈవో సమీక్ష
శివ కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు వేగవంతం చేయాలని ఈవో రమాదేవి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శన ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం, తాగునీరు, పారిశుధ్య పనులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏఈవోలు, పర్యవేక్షకులు, ఇంజినీరింగ్, శానిటేషన్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


