
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు బుధవారం రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ మా ర్కెట్ కమిటీ ఆవరణ, గంభీరావుపేటలో రైతులు బైఠాయించారు. వారు మాట్లాడుతూ గంటల కొద్దీ క్యూలైన్‌లో నిల్చున్నా సరిపడేంత యూరియా బస్తాలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దార్ మారుతిరెడ్డి రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. రాచర్లబొప్పాపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 440 బస్తాల యూరియా రాగా.. 220 బస్తాలను రాచర్లబొప్పాపూర్‌లో దింపి మిగతావి వేరే చోటుకు తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి.. రేపు మరో లారీలోడ్ యూరియాను తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా అందించారు.