సిట్ వేసి సమగ్ర దర్యాప్తు చేయించాలి వాస్తవాలు కప్పిపుచ్చేందుకు కట్టుకథ అల్లుతున్నారు 24 గంటల్లో పోలీసులకు రక్తపరీక్షలు చేయించాలి రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతోంది దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి డిమాండ్
ఒంగోలు సిటీ: కారులో గంజాయిని తీసుకెళుతూ ఎస్‌ఐలు అద్దంకి సమీపంలోని శంఖవరప్పాడు వద్ద దొరికిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం, హోం మంత్రి నిత్యం ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, గంజాయి, మద్యం ఏరులై పారుతున్నాయని ఆయన ఆరోపించారు. పోలీసుల వద్ద ఉన్న గంజాయి ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని, అది ఎవరి దగ్గర నుంచి తెచ్చారో తేల్చాలన్నారు. ఏదైనా కేసులో పట్టుకుంటే దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ చూపించాలని డిమాండ్ చేశారు.
సిట్‌తో దర్యాప్తు చేయాలి..
అద్దంకిలో గంజాయితో పోలీసులు ఉన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్ వేసి దర్యాప్తు చేయాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీస్‌శాఖ పరువు పోతుందని భయపడి జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు రాత్రి 11 గంటలకు ఓ కట్టుకథ అల్లారని ఆయన ధ్వజమెత్తారు. ఆటో, ద్విచక్ర వాహనాలను కారు ఢీకొన్న తరువాత స్థానికులు అక్కడకు చేరుకున్నారని, కారులో ఉన్న వారు మద్యం తాగి ఉన్నారని, అందులో పోలీసులు ఉన్నారని గుర్తించారన్నారు. స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు చెప్పే దాని ప్రకారం బల్లికురవ మండలం గంగమ్మ గుడి వద్ద చాలా మంది పోలీసులు సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పార్టీ చేసుకున్నారని చెబుతున్నారన్నారు. ఆ ప్రాంతానికి సంబంధం లేని గురజాలకు చెందిన సీఐ మురళి ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే అక్కడ పెద్ద ఎత్తున పార్టీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే గూగుల్ టేక్ అవుట్, సెల్ టవర్స్ ద్వారా వివరాలను సేకరించాలన్నారు. పోలీసులు తప్పతాగి యాక్సిడెంట్ చేసి, అమాయకులను ఆస్పత్రి పాలు చేశారన్నారు. జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు ద్విచక్ర వాహనంలో గంజాయి తీసుకెళుతుంటే పట్టుకున్నామని, బైక్‌ను వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని ఓ కథను సృష్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలకు పాల్పడుతున్నా తట్టుకుని నిలబడుతున్నాం. మీ అరాచకాలతో పాటు పోలీసులు గంజాయితో దొరకడమేమిటి, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు? హోం మంత్రి అనిత ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు ఎస్‌ఐలు ఎందుకు అక్కడ నుంచి పరారయ్యారని ప్రశ్నించారు. వారు మద్యం తాగి ఉన్నారు కాబట్టే అక్కడ నుంచి పారిపోయారన్నారు. అద్దంకి సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్‌ఐలను అక్కడ నుంచి పంపేశారని ఆరోపించారు. పోలీస్‌శాఖకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన వారిని ఎందుకు రక్షించాల్సి వచ్చిందో సీఐ సమాధానం చెప్పాలన్నారు. కారులో గంజాయితో పాటు మద్యం, బ్యాగులో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐలు ఎలాంటి తప్పు చేయకుంటే స్టేషన్‌కు ఎందుకు రాలేదన్నారు. రెండు వాహనాలను ఢీకొన్న సమయంలో వాహనం నడుపుతుంది ఎస్‌ఐ నాగరాజని, ఆయనపై ఎందుకు కేసు కట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు మద్యం తాగి ఉన్నారని స్థానికులు చెపుతున్న నేపథ్యంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లు ఎస్‌ఐలకు ఎందుకు చేయలేదని నిలదీశారు. 24 గంటల్లో వారికి పరీక్షలు నిర్వహించి మద్యం తాగారో లేదో అన్న విషయాలని తేల్చాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. డీజీపీ వెంటనే స్పందించి ఇద్దరు ఎస్‌ఐలకు రక్తపరీక్షలు చేయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
పోలీసుల తీరుపై అన్నీ అనుమానాలే..
జరిగిన ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పోలీసులు మద్యం తాగి వాహనం నడుపుతున్నారని ప్రత్యక్ష సాక్షులే చెబుతున్నారని, వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఎందుకు కథలు అల్లుతున్నారో చెప్పాలన్నారు. కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ఉన్నాయని, వాటిని ఎవరు తెచ్చారో తేల్చారన్నారు. కొన్ని రోజులుగా గురజాల నుంచి బల్లికురవ మధ్యలో గ్రానైట్ వాహనాలు తిరుగుతుండడంపై వివాదాలు ఉన్నాయన్నారు. గురజాలకు చెందిన సీఐ మురళి ఇక్కడకు ఎందుకు వచ్చారు, పార్టీ ఎందుకు పెట్టుకున్నారో ఆలోచిస్తే గ్రానైట్ లింకులపై అనుమానం వస్తోందన్నారు. వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగేందుకు గ్రానైట్ వ్యాపారులతో కలసి పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, కారులో ఉన్న బ్లూ బ్యాగ్‌లో పెద్ద ఎత్తున నగదు ఉందన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ బ్యాగును ముట్టుకోకుండా అద్దంకి సీఐ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ బ్యాగులో ఏముందో బహిర్గతం చేయాలన్నారు. అసలు గుడి వద్ద ఏం జరిగిందో తేల్చేందుకు సిట్ వేయాలని బూచేపల్లి డిమాండ్ చేశారు.
అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్ మాట్లాడుతూ పోలీసులు తమ స్వలాభం కోసం మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తప్పు చేసిన పోలీసులను వదిలేసి, మావాళ్లపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. సాక్షాత్తు ఓ మంత్రి పీఏ ఆ పార్టీలో ఉన్నాడా లేదా అని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా స్పందన లేదని విమర్శించారు. పోలీసులు నిజంగా తప్పు చేయకపోతే అక్కడ నుంచి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.
సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులకం కోటిరెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు జజ్జర ఆనందరావు, మాజీ కౌన్సిలర్ బాలూ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగేష్, టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు నాగూర్ వలి, తదితరులు పాల్గొన్నారు.


