మసీదు సమీపంలో సులభ్‌ కాంప్లెక్స్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

మసీదు సమీపంలో సులభ్‌ కాంప్లెక్స్‌ వద్దు

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

ముస్లిం పెద్దల విజ్ఞప్తి

ఒంగోలు టౌన్‌: ముస్లింలు పవిత్రంగా భావించే మసీదుకు అత్యంత సమీపంలో సులభ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని నగరంలోని అద్దంకి బస్టాండు సెంటర్లోని మీనా మసీదుకు చెందిన ముస్లింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మసీదుకు ప్రతిరోజు ఐదు పూటల నమాజు చేసుకోవడానికి భక్తులు వస్తుంటారని, వారికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించవద్దని కోరారు. ఈ మేరకు సోమవారం మీనా మసీదు వద్ద ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు షేక్‌ సందాని మాట్లాడుతూ..ప్రస్తుతం మురుగు కాల్వ కోసం జరుగుతున్న ఏర్పాట్లను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నేరుగా కాలువ తవ్వడానికి అవకాశం ఉన్నా వివాదంలో ఉన్న ముస్లింల స్థలంలోకి కాలువ గుంతలు తవ్వినట్లు తెలిపారు. ఈ స్థలంలో గత 60 ఏళ్లుగా జిలానీ, ఇందాద్‌ కుటుంబాలు ఉంటున్నారని, చేతిపనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని వివరించారు. వారికి ఇబ్బంది కలిగించేలా కాలువ తవ్వకాలు చేస్తున్నారని, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినా మున్సిపల్‌ అధికారులు లెక్కచేయక పోవడం బాధాకరమని చెప్పారు. తొలుత కలెక్టర్‌ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో కలెక్టర్‌ పి.రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ను కలిసి సులభ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షేక్‌ బాబు, మహమ్మద్‌ షరీఫ్‌, ముజహర్‌, మీనా మసీదు ప్రసిడెంట్‌ షేక్‌ సంధానీ, కార్యదర్శి షేక్‌ మున్వర్‌, కోశాధికారి అన్వర్‌, సీపీఐ జిల్లా నాయకులు ఎంఏ సాలార్‌, మీనా మసీదు కమిటీ పెద్దలు, కోట వీధి మైనారిటీలు పాల్గొన్నారు.

నిరుపేద కడుపు కొట్టొద్దు...

మీనా మసీదు వద్ద ఉన్న స్థలంలో తమ పెద్దల నుంచి నేటి వరకు చేతిపనులు చేసుకొని జీవిస్తున్న తమ పొట్టకొట్టవద్దని షేక్‌ ఇందాద్‌ ఉరఫ్‌ బుజ్జీ విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. 60 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న ఈ స్థలంలో మురుగు కాల్వ కోసం గుంతలు తవ్వడం ఆవేదన కలిగించిందని, మసీదుకు అత్యంత సమీపంలో సులభ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయడం బాధాకరమన్నారు. తెలిసీ తెలియక తానేదైనా తప్పు చేసి ఉంటే తనను క్షమించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను వేడుకుంటున్నట్లు చెప్పారు. తమ స్థలానికి దూరంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలువ నిర్మించాల్సిందిగా నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement