సమ్మెను పరిష్కరించకుండా జూడాలను విడగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం జూడాల ప్రసిడెంట్ డాక్టర్ భార్గవ సాయి
ఒంగోలు టౌన్: పేరుకే అది ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి. అరకొర సౌకర్యాల మధ్యనే జూనియర్ వైద్యులు రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. అయినా జూనియర్ డాక్టర్లకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి సరిపడేలా స్టైఫండ్ ఇవ్వమని అడుతుంటే ఎక్కువ ఇచ్చే చోటికే వెళ్లమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. స్టై ఫండ్ పెంచాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం విషయంలో ఎన్‌ఎంసీ నిబంధనలను పాటించాలని, రిటైర్డ్‌మెంటు వయసు 65 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా జూడాలను కించపరిచేలా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర సేవల బహిష్కరణ...
దశల వారీగా సమ్మె చేస్తున్న జూడాలు సోమవారం నుంచి అత్యవసర సేవలను బహిష్కరించారు. 7వ రోజు సమ్మెలో భాగంగా ఐసీయూ, క్యాజువాలిటీ, గైనిక్, ఆపరేషన్స్ సేవలను బహిష్కరించారు. రిలే నిరాహార దీక్షలను కొసాగిస్తున్నారు. మెడికల్ కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించిన జూనియర్ డాక్టర్లు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. వియ్ వాంట్ జస్టిస్ నినాదాలతో దీక్షా శిబిరం దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా జూడా ప్రసిడెంట్ డాక్టర్ భార్గవ సాయి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో జూడాలు అత్యవసర సేవలను కూడా బహిష్కరించినట్లు జూడా ప్రసిడెంట్ డాక్టర్ భార్గవ సాయి నాయుడు తెలిపారు. ప్రభుత్వం జూడాలతో మూడు సార్లు చర్చలు జరిపినా సానుకూలంగా వ్యవహరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రెండేళ్లకోసారి స్టైఫండ్ రివైజ్ చేయాల్సి ఉందని, 20 నెలలు గడుస్తున్నా స్టై ఫండ్ రివైజ్ చేయలేదని తెలిపారు. ఎన్‌ఎంసీ పరిమితికి దాటి ఎమ్మెస్సీ పీహెచ్‌డీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించడం తగదన్నారు. మెడిసిన్ పూర్తి చేసిన తరువాత ప్రభుత్వ రంగంలో వైద్య సేవలందించాలనుకుంటున్న వైద్యులకు ప్రోత్సాహం ఇవ్వకుండా రిటైర్‌మెంటు వయసు పెంచడం నష్టం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిచాలని కోరారు. ఈ రిలే నిరాహార దీక్షల్లో జూడాలు వేణు, యువరాజ్, త్రిశూల, నవత, రసూల్, దర్పన్ తదితరులు పాల్గొన్నారు.


