చీమకుర్తి రూరల్:
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం కొత్తేమీ కాదని, అది ఆయన నైజమని ధ్వజమెత్తారు. చీమకుర్తి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో అంకమ్మతల్లి తిరునాళ్లు సందర్భంగా ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే ముఖ్యమంత్రి ప్రజలకొద్దని, ఇచ్చిన మాట నెరవేర్చే జగనన్నని సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గడపగడపకు సంక్షేమం అందించిన జగనన్న మన రాష్ట్రానికి సీఎంగా ఉండాలని, పేద ప్రజల కోసం 2029లో జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుందామని అన్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు కొండంత అండ : మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రైతన్నకు అండగా జగనన్న ప్రభుత్వం నిలిచిందని వివరించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజలను, మహిళలను, రైతులను మోసం చేస్తోందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలివ్వకుండా, ప్రభుత్వం కొనకుండా మోసం చేస్తోందని తెలిపారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలంతా బుద్ధి చెప్పాలన్నారు. పొగాకు రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, ఆరుగాలం అష్టకష్టాలు పడి పొగాకు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకునే పరిస్థితిలో వెన్నుపోటు ప్రభుత్వం లేదని విమర్శించారు. రైతన్నల పక్షాన వైఎస్సార్ సీపీ నాయకులు పోరాడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, ఆ శ్రద్ధ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించడంలో ఎందుకు లేదని వెన్నుపోటు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్త కష్టపడి పనిచేసి 2029 ఎన్నికల్లో జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పాలెపు తిరుపతిస్వామి, సుబ్బారావు, కడియాల మల్లికార్జున, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఎస్‌ఎన్ పాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి రామచంద్రారావు, మాజీ కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, సుంకర శ్రీను, బాలాజీ, కొల్లూరి శివన్నారాయణ, కత్తి రమణారెడ్డి, మేకల వీరారెడ్డి, మన్నం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు
రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించకుండా దగా చేస్తున్నారు
పొగాకు, పత్తి, మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
రాష్ట్రానికి వెన్నుపోటు ముఖ్యమంత్రి వద్దు
ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగనన్నే ముద్దు
సమష్టి కృషితో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున పిలుపు


