కనిగిరిరూరల్: మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన దరిశి చెంచయ్య 1905లో జరిగిన వందేమాతర ఉద్యమం, ఆ తర్వాత స్వదేశీ ఉద్యమాలకు ఆకర్షితుడైన చెంచయ్య..స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఒంగోలులో విద్యార్థుల చేత చేనేత మగ్గాలపై బట్టలు నేయించి..ధరింప చేశారు. 1912లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో వ్యవసాయ శాస్త్ర విభాగంలో దరిశి చెంచయ్య చేరారు. అక్కడ భారత విప్లవకారులు లాలా హరదయాళ్ , జితేంద్రనాథ్ లహరీ పరిచయమై, వారి ప్రసంగాలకు ఆకర్షితులై..ఉత్తేజితులైన చెంచయ్య వారితో కలిసి అమెరికా, కెనడా, దేశాల్లోని పంజాబి సిక్కులను, వ్యవసాయ కార్మికులను సమీకరించి 1913లో గదర్ పార్టీని స్థాపించారు. అప్పట్లో దేశభక్తి పూరిత భావజాలంతో గదర్ అనే పత్రికను కూడా ఆయన ప్రచురించారు. దరిశి చెంచయ్య కమ్యునిస్టు ఉద్యమంలో, ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల ఉద్యమంలో చాలాకాలం పనిచేశారు. 8 ఏళ్లు జైలు జీవితాన్ని గడిపారు. 1939–40 దక్షణ భారత తొలి రాజకీయ ఖైధీగా దరిశి చెంచయ్య అరెస్ట్ అయ్యారు. సుమారు 4 ఏళ్లు తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు జైల్లో గడిపారు.


