స్వాతంత్య్ర సమరంలో జిల్లా వీరుల వీరోచిత గాథలు
ఉప్పు సత్యాగ్రహం నుంచి గిరిజన పోరాటాల దాకా..
మహనీయుడు
మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని:
కంభం: స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ జాతీయ నాయకులతో కలిసి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, జైలు జీవితం అనుభవించడమే కాకుండా దేశం కోసం తనకున్న వందల ఎకరాల భూమిని సైతం త్యాగం చేసిన మహనీయుడు సయ్యద్ షా మౌలానా మోహిద్దీన్ ఖాద్రి బియాబాని. 1920లో విజయవాడలో జరిగిన జాతీయ మహాసభ కార్యక్రమంలో పాల్గొని జాతిపిత మహాత్మగాంధీని కలిశారు. 1923లో అఖిల భారత జాతీయ పతాక సత్యాగ్రహ ఉద్యమంలో ఆయన మువ్వన్నెల జెండా భుజాన మోస్తూ పల్లెపల్లెకు తిరిగారు. స్వాతంత్య్ర పోరాట సందర్భంలో డా.బాబు రాజేంద్రప్రసాద్ ను ఆయన రహస్యంగా కలుసుకున్నందుకు బ్రిటీషు ప్రభుత్వం ఆయన్ను అస్సాం రాష్ట్రంలోని ‘గయా’ జైలులో పెట్టింది. ఆ సమయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి డా. అబుల్‌కలాం ఆజాద్ జైలులో ఆయన సహచరుడిగా ఉన్నారు. ఆయన 11 భాషలపై విశేష పట్టు కలిగిన వ్యక్తిగా ప్రావీణ్యం సంపాదించారు. డాక్టర్ బాబు రాజేంద్రపసాద్, జవహర్ లాల్ నెహ్రూ కర్నూలు పర్యటనకు వచ్చిన సమయంలో బియాబాని గురించి తెలుసుకొని ఆయన ఇంటికి వారు స్వయంగా వెళ్లి అభినందించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడమే కాకుండా దేశం కోసం తన ఆస్తులను సైతం త్యాగం చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. స్వాతంత్య్రం అనంతరం ఆయన 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
కనిగిరిరూరల్: పీసీపల్లి మండలం పెద ఇర్లపాడులోని ఓ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన కాకుమాని వెంకటేశ్వర్లు గదర్‌పార్టీ వ్యవస్థాపకుడు దరిశి చెంచయ్యతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలకులు కాకుమానిపై పలుకేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కమ్యునిస్టు పార్టీ ఉద్యమంలో కామ్రేడ్ గుజ్జుల యల్లమందారెడ్డితో కలిసి అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. గూఢచార సమాచారం కోసం అడవి బాటలో నుంచి బయటకు వస్తున్న కాకుమాని వెంకటేశ్వర్లును పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న కమ్యునిస్టు ఉద్యమకారుల పేర్లు, ఆచూకీ చెప్పాలని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. ‘నా ప్రాణాలుతీసినా ప్రజా ఉద్యమకారుల ఆచూకీ చెప్పను’ అని కాకుమాని తెగేసి చెప్పడంతో 1950 సెప్టెంబర్ 19న నేరేడుపల్లిలోకి తీసుకొచ్చి గ్రామ నడిబొడ్డున రాతి కూసానికి కట్టి గ్రామ ప్రజలు చూస్తుండగా తుపాకీతో కాల్చి చంపినట్లు పాత తరం వారు చెబుతున్నారు.
ప్రజా జీవితంలో కందుల
ఓబులరెడ్డిది చెరగని ముద్ర


