గిద్దలూరు రూరల్: తెల్ల దొరల గుండెల్లో దడపుట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాట నమూనా సాక్ష్యాలు గిద్దలూరు మండలంలో నేటికీ ఆనవాలుగా నిలిచిపోయాయి. ఆయన ప్రాణత్యాగానికి ప్రతీకగా గిద్దలూరు మండలంలోని కొత్తకోట గ్రామ సమీపంలోని కొండ పై ఫిరంగి నేటికీ చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. నంద్యాల జిల్లా కోవెలకుంట నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీషు పాలనలో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు నిలిచి పోరాడేందుకు నిలబడ్డాడు. ఆ సమయంలో ప్రజలను వేధిస్తున్న బ్రిటీషు అధికారి అయిన తహశీల్దార్ తలనరికాడు. తెల్లవారికి వ్యతిరేకంగా అప్పటి కర్నూలు, కడప జిల్లా, ప్రకాశం జిల్లా సరిహద్దులతో తన అనుచరులతో కలిసి పోరాడాడు. అందులో భాగంగానే గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామ సమీపంలో కొండపై ఒక ఫిరంగిని ఏర్పాటు చేసుకుని తెల్లవారితో పోరాడాడని చరిత్రకారులు చెబుతుంటారు. తమకు కంటిలో కునుకులేకుండా చేస్తున్న నరసింహారెడ్డిని బ్రిటీష్ అధికారులు ఫిబ్రవరి 22న 1847లో బహిరంగంగా జువేటి వాగు ఒడ్డున ఉరి తీశారు. ఇక్కడి వారు ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధీరత్వాన్ని స్మరించుకుంటుంటారు.


