సవాల్‌ రాజాగా మారారు.. | - | Sakshi
Sakshi News home page

సవాల్‌ రాజాగా మారారు..

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

కందుకూరు మున్సిపాలిటీతో పాటు స్థానిక ఎన్నికలకు మేము సిద్ధం స్థానిక ప్రజల మనోభావాలు గౌరవించి ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలి రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ, పొగాకు గిట్టుబాటు ధరలను పక్కదారి పట్టించేందుకు సవాల్‌ డ్రామా వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు..

వసూల్‌ రాజా..

కందుకూరు రూరల్‌: ‘కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వసూళ్ల రాజా.. సవాల్‌ రాజాగా మారినట్లు కనిపిస్తుందని’ వైఎస్సార్‌ సీపీ కందుకూరు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా దోపిడీ చేసిన డబ్బుతో ఎన్నికలకు వెళదామని ఎమ్మెల్యే సవాల్‌ చేస్తున్నారన్నారు. దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలు కోరిక మేరకు ఆ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ ప్రభుత్వం నుంచి అందించాలన్నారు. ఆ గ్రామాలకు మంచి చేస్తే సవాల్‌ను స్వీకరిస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి కనెక్టివిటీ ఉన్న గ్రామాలను వదిలేసి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలుపుతూ ఆ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం సవాలు చేస్తున్నట్టు ఉందే తప్ప మరొకటి కనిపించడం లేదన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలకు వైద్యం అందకుండా చేసి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంచుతున్నామని డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో పింఛన్లు పంచుతూ ఫొటోలు దిగడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ట్రాఫిక్‌ సమస్య ఉన్న ప్రధాన రహదారి వదిలివేసి ఎక్కడో సందుల్లో గొందుల్లో సైడ్‌ కాలువల్లో బిట్లు బిట్లుగా రోడ్లు వేస్తూ అదే అభివృద్ధి అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.

దూరంగా ఉన్న గ్రామాల విలీనం దారుణం..

కందుకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ దురుద్దేశంతోనే దూరంగా ఉన్న ప్రాంతాలను స్థానిక ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఆ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారన్నారు. గ్రామస్తులు మాకు మున్సిపాలిటీ వద్దని, పంచాయతీలు గానే ఉంచాలని కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ అవసరాల కోసం దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నారన్నారు. ఆనందపురం, శామీరపాలెం, చుట్టుగుంట, దివివారిపాలెం, గనిగుంట పంచాయతీలుగా ఏర్పడి ఉంటే ఆ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీకి ఎంతో దూరంగా ఉన్న గ్రామాలతో ఆర్థికభారం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. స్థానిక ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సరైనది కాదని హితవు పలికారు. మీ రాజకీయ ఉద్దేశాలతో దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులు పాలు చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికై నా ఆ గ్రామాలను పంచాయతీలుగా మార్చి అనంతరం మీ మున్సిపాలిటీల్లో నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని గ్రామస్తులు అంటున్నారని పేర్కొన్నారు. ఆనందపురం, శామీరపాలెం, గనిగుంట గ్రామాలను మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్నా అర్బన్‌లో కలపడం వల్ల ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీని వల్ల స్థానికంగా ఉండే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల మనోభావాలు గౌరవించాలి

ఎన్నికలకు తామూ ఎప్పుడూ సిద్ధమేనని బుర్రా స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ వద్దు మా గ్రామాలను పంచాయతీలుగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. భూములు ఇచ్చిన రైతులు, ఇళ్లు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రామాయపట్నం పోర్ట్‌ ప్రైవేటీకరణ ఆపమని డిమాండ్‌ చేస్తే కేసులు పెట్టించిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగ బుద్ధి నీదని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ పోరాడుతుంటే డైవర్ట్‌ చేయడానికి ఈ సవాల్‌ చేస్తున్నావు తప్ప కందుకూరు మున్సిపాలిటీపై ప్రేమ లేదన్నారు. పోలీసులను, సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించి కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారన్నారు. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు రోడ్డు మీదకు వస్తే వారికి సంఘీభావంగా వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించడం రెడ్‌బుక్‌ రాజ్యాంగం కాదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం, ఇసుక, మద్యం, మట్టి మాఫియా, రోడ్డు నిర్మాణ పనులు నిర్మాణంలో జరుగుతున్న అవినీతి గురించి సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో డీఎస్సీ రాసిన నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారన్నారు. ఆ యువతకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ ఉండి సీబీఐతో విచారణ చేయాలని అడుగుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీ, కందుకూరు అధ్యక్షుడు ఈదర రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధులు ముప్పవరపు కిషోర్‌, బద్దిపూడి జయరావు, కందుకూరు నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నలమోతు చంద్రమౌళి, పట్టణ ఉపాధ్యక్షుడు తల్లపనేని గోపి, ముప్పరాజు సుభాని, మందలపు మహేష్‌, ముప్పరాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement