● ఆంధ్రకేసరి నగర్, సమతానగర్‌లో రెండు చోరీలు
● మొత్తం 50 సవర్ల బంగారం, నగదు అపహరణ
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. బుధవారం రెండు వేర్వేరు ఇళ్లలో తాళాలు పగులగొట్టి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆంధ్రకేసరి నగర్‌లో నివాసం ఉండే ఆలపాటి సత్యానందరావు, సుజాత దంపతులు కర్నూలు రోడ్డులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం సుజాత తిరిగి రాగా, మెట్లపై ఓ అపరిచితుడు కనిపించి పైనున్న బ్యాచిలర్ల వద్దకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆమె పైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలతో పాటు లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది.
లైన్‌మెన్ ఇంట్లో 20 సవర్ల చోరీ..
ఎస్పీ కార్యాలయం, తాలూకా, రూరల్ పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోని సమతానగర్‌లో మరో దొంగతనం జరిగింది. రెండో వీధిలో నివాసం ఉండే విద్యుత్ లైన్‌మెన్ నాగరాజు, ప్రైవేట్ నర్సుగా పనిచేస్తున్న ఆయన భార్య ఎప్పటిలాగే ఉదయం విధులకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని 20 సవర్ల బంగారం, నగదును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామ పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న గదిలో నేలపై పడుకుని ఉన్న మహిళ తలపై పెద్ద బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. స్థానికుల సమాచారంతో బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి గ్రామస్తుల వివరాల ప్రకారం.. దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన కోటినేని రమణ(25)కు కనిగిరి ప్రాంతం పాపినేనిపాలేనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటంతో రమణ పుట్టింటికి వచ్చేసింది. అయితే వారం క్రితం భర్త చందవరం వచ్చి రమణను తనవెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆమె కల్లూరు పొలాల్లో విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడా? లేక మరేమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


