పొదిలి: 80 ఏళ్ల క్రితం సామాజిక దృక్పథంతో ఏర్పాటైన సొసైటీ..నేడు బెదిరించి వసూళ్లకు పాల్పడుతోంది. వివరాల్లోకి వెళితే..1951లో వేమూరి విశ్వనాథశర్మ అధ్యక్షునిగా పొదిలి రూరల్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఏర్పాటు రిజిష్టర్ చేయించారు. ఆ సమయంలో సొసైటీ పేరుతో 87 ఎకరాలు సేకరించారు. ఈ 87 ఎకరాల్లో సామాజిక అవసరాలకు కొంత మినహాయించి 347 ప్లాట్లు వేశారు. అప్పట్లో ఒక్కో ప్లాట్‌కు రూ.300 ధర నిర్ణయించి 267 మంది సభ్యులకు విక్రయించారు. స్థలాలను కొనుగోలు చేసిన సభ్యులు కొంత మంది గృహాలు నిర్మించుకొని నివాసముంటున్నారు. మరికొంత మంది స్థలాలను ఇతరులకు అమ్ముకున్నారు. 1969లోనే సొసైటీ కార్యక్రమాలు నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు.
కప్పం కట్టాలంటూ బెదిరింపు
1969లోనే సొసైటీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే ఆరేడు సంవత్సరాలుగా మళ్లీ సొసైటీ వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. కడప నుంచి వచ్చినట్లుగా చెబుతున్న వ్యక్తి, అప్పటి సొసైటీ చైర్మన్ ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని కొంత సొమ్ము వసూలు చేసుకున్నారు. కొంత మంది వారు అడిగినంత ముట్టచెప్పి రిజిష్టర్ చేయించుకున్నారు.
కూటమి అధికారంలోకి రాగానే వసూళ్ల పర్వం
కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ సొసైటీ వ్యవహారాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీ నిర్వహిస్తున్నామని, త్రీ మెన్ కమిటీ సొసైటీ నిర్వహణ చూస్తోందని ఉత్తర్వులు చూపిస్తున్నారు. దీంతో ఎప్పుడో దశాబ్దాల నాడు స్థలాలు కొనుగోలు చేసిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.
నోటీసుల పేరుతో భయభ్రాంతులు
ఇటీవల కొంత మంది సొసైటీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారి వద్దకు వచ్చి ‘ సొసైటీ స్థలం నీ పేరున ఉందని, లేదా అందులో ఉన్న భవనం మీ పేరున ఉందని, సొసైటీ రిజిష్ట్రర్ చేస్తేనే చెల్లుతుందని, అలా చేయించుకోకపోతే ఇతరులకు కేటాయిస్తామని పేర్కొంటూ సొసైటీ పేరున నోటీసులు ఇస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే 9 మందికి నోటీసులు ఇచ్చారు. వారం పది రోజుల వ్యవధిలో కొన్ని స్థలాలను ఇతరులకు సొసైటీ పేరున రిజిష్టర్ చేయించారు. దీంతో దశాబ్దాల నాడు కొనుగోలు చేసి అనుభవం, ఆధీనంలో ఉన్న సభ్యులకు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఈ విషయమై సొసైటీ ప్రస్తుత చైర్మన్ మీగడ ఈశ్వరరెడ్డి వివరణ ఇస్తూ అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని చెప్పారు. ఒక్కొక్కరికి ఐదారు ప్లాట్లు ఉన్నాయని, అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సొసైటీ బాడీ రద్దు కాలేదని, కొనసాగుతూనే వస్తుందన్నారు. ఇప్పుడు త్రీ మెన్ కమిటీ కార్యకలాపాలను చూస్తుందని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై కమిటీ ఫిర్యాదు చేస్తుందన్నారు. ఆక్రమణదారులకు, బావులు పూడ్చి భవనాలు నిర్మించిన వారికి ఇప్పటికే పలు పర్యాయాలు నోటీసులు పంపించినా సమాధానం రాలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రే న్యాయం చేయాలి
జూనియర్ కాలేజీ రోడ్డులోని మా స్థలంలోకి పాశం రాజు అనే వ్యక్తి చదును చేసేందుకు రాగా అడ్డుకున్నాం. ఈశ్వరరెడ్డి ఈ స్థలం రాసిచ్చాడని, మీకు చెల్లదని దౌర్జన్యానికి దిగారు. పోలీసులను పిలిచి మమ్మల్ని స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేయాలని చూశారు. కానీ ఆ స్థలం మాది కావడంతో మేం ఎక్కడకు రావాల్సిన అవసరం లేదని చెప్పాం. ఏ విధంగానైనా స్థలం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి.
– చీతిరాల శేషగిరిరావు, నాగలక్ష్మి, బాధితులు


