● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
మార్కాపురం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఓఎస్‌డీ నవజ్యోత్ మిశ్రా, డీఎస్పీ నాగరాజుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాల్లో ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు విద్యార్థులు యువత ఉద్యోగులు స్వచ్ఛందంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వాయు కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ రూరల్ ఎస్సైలు విశ్వనాథరెడ్డి, వేమన సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10 వ తేదీన జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా దేశీయ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సవరణల పేరుతో జీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని, దీని వల్ల గ్రామీణ నిరుపేద, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం తగదని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 వ తేదిన క్విట్ ఇండియాడేని పురస్కరించుకొని కేంద్ర కమిటీ పిలుపు మేరకు జైలుభరో చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, కందుకూరు, అద్దంకి రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో జైలుభరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో కాలం సుబ్బారావు, పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు, శ్రీకాంత్, బెజవాడ శ్రీను, నెరుసుల వెంకటేశ్వర్లు, వడ్డే హనుమారెడ్డి, టంగుటూరి ప్రభాకర్, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాలతో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తొలిరోజు 6వ తేదీ ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో, 7వ తేదీ యువజన విభాగం ఆధ్వర్యంలో, 8వ తేదీ ఒంగోలు నగర పార్టీ ఆధ్వర్యంలో, 9వ తేదీ కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దీక్షలకు చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై.వెంకటేశ్వర్లు నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజా ఉద్యమకారులు, వక్తలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించాలని చుండూరి రవిబాబు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.


