9న అండర్‌–14 ఉషు జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

9న అండర్‌–14 ఉషు జట్టు ఎంపిక

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

9న అండర్‌–14 ఉషు జట్టు ఎంపిక విద్యుదాఘాతంతో రైతు మృతి రైల్వే ట్రాక్‌పై మృతదేహం తాళం వేసిన ఇంట్లో చోరీ మద్యం మత్తులో రౌడీ మూకల వీరంగం

ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఉషు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14 జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మాంటిస్సోరి స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2012 జనవరి 1 నుంచి 2017 డిసెంబర్‌ 31 మధ్య జన్మించిన బాలురు, బాలికలు అర్హులని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ ఫొటోలు, గత క్రీడా సర్టిఫికెట్లతో ఉదయం 9.30 గంటలకల్లా హాజరు కావాలని స్పష్టం చేశారు. వివరాలకు 90108 61207, 98484 99330ను సంప్రదించాలని సూచించారు.

తాళ్లూరు: మోటారు ఫ్యూజులు వేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని తురకపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చంద్రగిరి వెంకటరెడ్డి (53) ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. మోటారు వేయగా నీరు రాకపోవడంతో కరెంట్‌ లేదని గమనించాడు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ఫ్యూజులు వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. వెంకటరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి కృష్ణాకెనాల్‌ పరిధిలో గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో బుధవారం తాడేపల్లి కృష్ణాకెనాల్‌ జీఆర్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాక్‌పై రెండు ముక్కలుగా పడిఉన్న మృతదేహాన్ని పక్కకు తీశారు. ఏఎస్‌ఐ రత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్‌పై 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రెండు ముక్కలుగా పడి ఉన్నాడని, అతని జేబులో వెతగ్గా ఆధార్‌ కార్డు లభించిందని, అయితే ఆధార్‌కార్డులో ఉన్న వ్యక్తి ఇతను ఒకటేనా అన్నది అనుమానంగా ఉందని తెలిపారు. ఆధార్‌కార్డులో వీర్ల గురవయ్య, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామం అని ఉందని, ఆ గ్రామంలో విచారణ చేస్తే తప్ప ఆధార్‌ కార్డులో ఉన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరా కాదా అనేవిషయం తెలియదన్నారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్‌ ఫైటర్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహాయంతో గుంటూరు రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

మేదరమెట్ల: మండల పరిధిలోని తిమ్మనపాలెంలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో తెల్లబాటి రాఘవ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన భార్య ఉద్యోగిని కావడంతో ఆమెను వదిలిపెట్టేందుకు రాఘవ ఒంగోలు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తెరిచి, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఎంత నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యాయనే వివరాలపై బాధితుల నుంచి సమాచారం సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బీరు సీసాలతో పరస్పర దాడులు

సంతనూతలపాడు శివారులో ఘటన

ఒంగోలు టౌన్‌: మద్యం మత్తులో రౌడీ మూకలు వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్న ఘటన సంతనూతలపాడు సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న మన్నే రామాంజనేయులు, వన్‌టౌన్‌ పరిధిలో రౌడీషీటర్‌ అయిన కొత్త హరీష్‌ వర్గీయులు మంగళవారం రాత్రి సంతనూతలపాడు నుంచి ఒంగోలు వచ్చే మార్గంలో కోల్డ్‌ స్టోరేజీ వద్ద గల మద్యం దుకాణానికి చేరుకున్నారు. పీకలదాకా మద్యం తాగి వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు మద్యం సీసాలతో దాడులు చేసుకోవడంతో రెస్టారెంట్‌లోని జనం పరుగులు తీశారు. ఈ దాడిలో కొత్త హరీష్‌కు గాయాలు కాగా, జీజీహెచ్‌కు తరలించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం హరీష్‌ ఆస్పత్రి నుంచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. హరీష్‌ ఫిర్యాదు మేరకు ఒంగోలుకు చెందిన మన్నే రామాంజనేయులు, అభి నాయుడు, మనో, నితిన్‌లపై సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రామాంజనేయులు ముఠా కోసం గాలిస్తున్నామని, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అజయ్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement