● రాష్ట్ర ఉద్యానవన శాఖ డీడీ జమదగ్ని
ఒంగోలు సబర్బన్: ఉద్యాన రైతులు తమ పొలాల్లో వీడ్ మ్యాట్ వేసుకోవడంతో పాటు, పీఎండీఎస్ ద్వారా భూసారాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏవీఎస్‌వీ జమదగ్ని సూచించారు. ఎల్‌నినో ప్రభావ పరిశీలనకు ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన గురువారం ఒంగోలు మండలం యర్రజెర్లలో పర్యటించారు. మామిడి, నిమ్మ, కూరగాయల పంటలను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో నుంచి పంటలను కాపాడుకునేందుకు తోటల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే దీర్ఘకాలిక పంటలకు బదులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి వై.గోపీచంద్, అధికారులు సంధ్య, కృష్ణవేణి, శ్రీచరిత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


